ప్రతి బొట్టు ఒడిసి పట్టు.. భూగర్భజలాల పెంపునకు జిల్లాయంత్రాంగం యాక్షన్ ప్లాన్​

ప్రతి బొట్టు ఒడిసి పట్టు..  భూగర్భజలాల పెంపునకు జిల్లాయంత్రాంగం యాక్షన్ ప్లాన్​
  • వర్షపు నీరు భూమిలోకి ఇంకించేలా ‘ఉపాధి’ నిధులతో పనులు
  • పల్లె, పట్టణాల్లో ఇంకుడు గుంతలకు ప్రయార్టీ
  • పర్క్యూలేషన్ ట్యాంకులు, చెక్​డ్యామ్​లు, రేన్ వాటర్ హర్వేస్టింగ్ తదితర పనులకు ప్లాన్​
  • 16 మండలాలపై స్పెషల్ ఫోకస్

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగు, సాగునీటి కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లాయంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలు పెంచేలా యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. నీటి సంరక్షణ పనులకు ఉపాధి హామీ నిధులు వినియోగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.  ఆయా శాఖల అధికారులను ఇందులో భాగస్వాములను చేసింది. కమిటీలో అడిషనల్ కలెక్టర్,  డీఆర్డీవో, జిల్లా గ్రౌండ్​వాటర్ అధికారి, అగ్రికల్చర్, హార్టికల్చర్, మున్సిపల్​ కమిషనర్లు, ఇంజినీరింగ్​ శాఖల అధికారులు ఇందులో ఉంటారు.  

పల్లెలు, పట్టణాల్లోని ఇండ్లల్లో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ రీచార్జి గుంతలు, బోర్​వెల్​ రీచార్జి, రాతి కట్టడాలు, చెక్​డ్యామ్​లు, పర్క్యూలేషన్​ ట్యాంక్​లు, రేన్ వాటర్ హర్వేస్టింగ్ వంటి పనులు చేపట్టేందుకు కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

16 మండలాలపై ఫోకస్..

 జిల్లాలోని 16 మండలాల్లో భూగర్భ జలాలు అధిక లోతుల్లోకి వెళ్లాయి. 6 మండలాల్లో అయితే పరిస్థితి మరీ ధారుణంగా ఉంది. బీబీపేట మండలంలో  26.33 మీటర్లు, తాడ్వాయిలో 23.68 మీటర్లు, గాంధారిలో 23.49 మీటర్లు, దోమకొండలో 21.43 మీటర్లు, పిట్లంలో 21.38 మీటర్లు, రాజంపేటలో 20.34 మీటర్లకు నీటి మట్టాలు పడిపోయాయి.  మిగతా మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల మధ్య ఉన్నాయి. బీబీపేట, భిక్కనూరు,  దోమకొండ, కామారెడ్డి, గాంధారి, మాచారెడ్డి, రాజంపేట, తాడ్వాయి, లింగంపేట, నాగిరెడ్డిపేట, బిచ్​కుంద, రామారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, పిట్లం, పెద్దకొడప్ గల్ మండలాల్లో నీటి సంరక్షణ పనులు చేపట్టనున్నారు. అధికారుల కమిటీ ఈ మండలాలపై స్సెషల్​ ఫోకస్​ పెట్టింది. మిగతా మండలాల్లోనూ పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. 

చేపట్టే పనులు వివరాలు ఇలా..

ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం మ్యాజిక్ సోప్ పీట్లు 30, కమ్యూనిటీ సోప్​ పీట్లు  5,  రేన్ వాటర్​ హర్వేస్టింగ్ 2, బోర్ రీచార్జి 5, రాతి కట్టడాలు 2,  చెక్​డ్యామ్ 1, పర్క్యూలేషన్​ ట్యాంక్​1 చేపడుతారు.  టౌన్​లోని కాలనీల్లో కమ్యూనిటీ సోప్​ పీట్లు, ఇండ్లలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమయ్యాయి.  నీటి సంరక్షణ పనులతో ఇండ్లల్లోని వృథా నీరు, వర్షపు నీరు భూమి లోకి ఇంకనుంది.  

వట్టిపోయిన బోర్లు..

జిల్లాలో అత్యధిక సంఖ్యలో వ్యవసాయ బోర్లు వట్టిపోయాయి. 600 నుంచి 1200 ఫీట్ల లోతు బోర్లు తవ్వించినా చుక్క నీరు రాని పరిస్థితి. జిల్లాలో ప్రస్తుత సగటు నీటి మట్టం 15.21 మీటర్లు. 16 మండలాల్లో భూగర్భ జలాలు అత్యధిక లోతుల్లోకి వెళ్లాయి.  

జిల్లాలో తాగునీటి  కటకట..

జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో ఎండా కాలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.  జిల్లా కేంద్రంలో  పలు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటి సప్లయ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ ద్వారా 10 ట్యాంకర్లను తిప్పుతున్నారు. పదుల  సంఖ్యలో ప్రైవేట్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి.  ప్రైవేట్ ట్యాంకర్ ఒక్కోదానికి  రూ.550 నుంచి రూ. రూ.వెయ్యి వరకు చెల్లించాల్సి వస్తోంది. నీటిని నింపే బోర్ల వద్ద ట్యాంకర్లు బారులు తీరుతున్నాయి. 

ప్రజలు ముందుకు రావాలి 

నీటి సంరక్షణ పనులకు ప్రజలు ముందుకు రావాలి.  భూగర్భజలాలు పెంచేందుకు స్పెషల్​ యాక్షన్​ ప్లాన్​ కలెక్టర్ తయారు చేశారు. ఇప్పటికే ఈ పనులు షూరు అయ్యాయి.  ఇండ్లలో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి.  వట్టిపోయిన బోరు బావుల రీచార్జి, రేన్​ వాటర్ హర్వేస్టింగ్​, కమ్యూనిటీ ఇంకుడు గుంతలకు ప్రయార్టీ ఇవ్వాలి.      - సురేందర్​, డీఆర్డీవో 

భూమిలోకి నీటిని ఇంకిస్తే మేలు.. 

జిల్లాలో చాలా ఏరియాల్లో భూగర్భ జలాలు అత్యధిక లోతుల్లోకి వెళ్లాయి.  వర్షపు నీళ్లు భూమిలోకి ఇంకకుండా  బయటకు వెళ్తున్నాయి. తాగు, సాగు నీటి సమస్య తీవ్రమవుతోంది.  రానున్న వర్షకాలంలో వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలి. - సతీశ్​యాదవ్​, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి