విద్యార్థుల చూపు.. ప్రభుత్వ కాలేజీల వైపు .. కామారెడ్డి జిల్లాల్లోని జూనియర్ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు

విద్యార్థుల చూపు.. ప్రభుత్వ కాలేజీల వైపు .. కామారెడ్డి జిల్లాల్లోని జూనియర్ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు
  • ఫస్టియర్​లో ఇప్పటివరకు చేరినవారు 3,102 మంది 
  •  వసతులకు రూ.3.28 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరటానికి విద్యార్థులు ముందుకొస్తున్నారు. కళాశాలల్లో లెక్చరర్​ పోస్టుల భర్తీ, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కోసం ఫండ్స్​కేటాయింపు, ప్రభుత్వం స్పెషల్​గా ఫోకస్ చేయడం, లెక్చరర్ల విస్తృత ప్రచారం వంటి చర్యలతో కామారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో శుక్రవారం నాటికి ఫస్టియర్​లో 3,102 మంది అడ్మిషన్ ​పొందారు. నిరుడు 2,506 మంది మాత్రమే చేరగా ఈసారి 596 అడ్మిషన్లు పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది.  

20 కాలేజీలు..

జిల్లాలో 20 గవర్నమెంట్ జూనియర్ ​కాలేజీలు ఉన్నాయి. ఇప్పటివరకు జనరల్​ కోర్సుల్లో 2,690  మంది,  ఒకేషనల్ కోర్సుల్లో 412 మంది చేరారు. గతంలో మౌలిక వసతులు లేకపోవడం, లెక్చరర్ల కొరత  వంటి కారణాలతో  అడ్మిషన్లు తక్కువగా అయ్యేవి. ఈసారి సర్కార్ ​ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఎస్సెస్సీ ఫలితాలు వెలువడిన వెంటనే  లెక్చరర్లు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న వసతులు, బోధన తీరుతెన్నులతో కూడిన కరపత్రాలు ముద్రించి, పంపిణీ చేశారు. పదోతరగతి పాసైన విద్యార్థుల వద్దకు వెళ్లి, తమ కళాశాలల్లో చేరాలని కోరారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు 
ముందుకొచ్చారు.

 బాన్సువాడ, కామారెడ్డిల్లో అధిక ప్రవేశాలు

బాన్సువాడ గర్ల్స్​ జూనియర్​ కాలేజీలో జిల్లాలోనే అధికంగా అడ్మిషన్లు జరిగాయి. ఇక్కడ  445 మంది విద్యార్థులు చేరారు.  వీరిలో జనరల్ కోర్సుల్లో 233 మంది, ఒకేషనల్​ కోర్సుల్లో 212 మంది అడ్మిషన్ ​తీసుకున్నారు.  బాన్సువాడ జూనియర్​ కాలేజీలో 355 మంది  ప్రవేశాలు పొందారు. కామారెడ్డి జూనియర్​ కాలేజీలో శుక్రవారం నాటికి 436 అడ్మిషన్లు జరిగాయి.  జనరల్ కోర్సుల్లో 260 మంది, ఒకేషనల్​కోర్సుల్లో  176 
మంది చేరారు. 

ఇతర  కాలేజీల్లో ఇలా..

బిచ్​కుందలో 234 మంది,  లింగంపేటలో 166, దోమకొండలో 148,  జుక్కల్​లో 129, ఎల్లారెడ్డిలో 125, మద్నూర్​లో 123,  గాంధారిలో 117, పిట్లంలో 108, రామారెడ్డిలో 99, బీర్కుర్​లో 91, సదాశివనగర్​లో 88, మాచారెడ్డిలో 84,  భిక్కనూరులో 82,  బీబీపేటలో 78, నాగిరెడ్డిపేటలో 75, తాడ్వాయిలో 68, నిజాంసాగర్​కాలేజీలో 51 అడ్మిషన్లు అయ్యాయి.

త్వరలో పనులు ప్రారంభం

జూనియర్​కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.3.28 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అవసరం ఉన్న చోట్ల క్లాస్​రూమ్​లు, టాయిలెట్లు నిర్మించి, ఫర్నిచర్​కొనుగోలు చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

59 లెక్చరర్​ పోస్టులు భర్తీ

జిల్లాలో కొత్తగా 59  లెక్చరర్ పోస్టులు భర్తీ అయ్యాయి.  ప్రస్తుతం రెగ్యులర్​ లెక్చరర్లు  242 మంది, గెస్ట్​ లెక్చరర్లు 58 మంది ఉన్నారు.  నిజాంసాగర్​, బీబీపేట, నాగిరెడ్డిపేట, బీర్కుర్​లో గెస్ట్​ లెక్చరర్లను నియమించారు. ​ 

మంచి రిజల్ట్స్​తీసుకొస్తాం

ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో ఈసారి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరారు.  వారు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మెరుగైన విద్యాబోధన అందించి, మంచి రిజల్ట్స్​ తీసుకొస్తాం. లెక్చరర్ల కొరత లేదు. ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా సబ్జెక్టులు బోధించడంతో పాటు విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తాం.  

 షేక్ ​సలాం, ఇంటర్ ​నోడల్ ఆఫీసర్​