ఫూలే, సావర్కర్ మధ్య తేడా చూడు !

ఫూలే, సావర్కర్ మధ్య తేడా చూడు !

ఈ మధ్య ఆర్ఎస్ఎస్ ​అధినేత  వరుసగా ‘హిందూ రాష్ట్రం’  రాజ్యాంగంలో మార్పులు తెచ్చినా, లేకపోయినా అమలులోకి వస్తుందని పదేపదే ప్రకటిస్తున్నాడు. హిందూ రాష్ట్ర నిర్మాణ అవసరం గురించి బలమైన సిద్ధాంతం రాసిన వ్యక్తి సావర్కర్​ అని గత వ్యాసంలో చూశాం. ఇది మహారాష్ట్ర పీష్వా బ్రాహ్మణ రాజరిక అంతం తరువాత ఉనికిలోకి వచ్చిన బ్రిటిష్ పాలన, దాని అంతం తరువాత ఏర్పడాల్సిన రాజకీయ, సాంఘిక వ్యవస్థ రూపకల్పన గురించి ఒక సనాతన మరాఠి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సావర్కర్​ 1923లో  రాశాడని కూడా చూశాం.

ఆయనను ఇంగ్లాండుకు పంపించి చదివించింది కాంగ్రెస్​లో అతివాద నాయకుడుగా ఉన్న బాల గంగాధర్​ తిలక్. ఈయన మహాత్మా జ్యోతిరావు ఫూలే సమకాలికుడు. తిలక్​ 1856లో పుట్టి 1920లో చనిపోయాడు.  మహాత్మా ఫూలే 1827లో  పుట్టి 1890లో చనిపోయాడు. సావర్కర్​ 1883లో పుట్టి 1966లో చనిపోయాడు.

ఫూలే  దంపతులు పీష్వా బ్రాహ్మణీయ  పరిపాలనలో  తిరగదోడిన  వర్ణ వ్యవస్థపై,  తీవ్రమైన అంటరానితనంపై తిరగబడ్డారు. వీళ్లు మాలి అనే శూద్ర కులంలో పుట్టారు. అంటే  తెలుగు రాష్ట్రాల్లో ముదిరాజు, కాపు వంటి కులం. ఫూలే  దంపతులు కులాల సమానత్వం కోసం అహింసాయుతమైన పోరాటం మొదలుపెట్టిన మొట్టమొదటి శూద్ర మేధావులు. ఫూలే  రాసిన  గులాంగిరి  పుస్తకం ఆధునిక ప్రజాస్వామిక భారత నిర్మాణానికి పునాదులు వేసింది.

కులాల మధ్య సమానత్వం రాకుండా ప్రజాస్వామిక వ్యవస్థ బతకదు. ఈ విషయాన్ని ఫూలే అమెరికాలో  తెల్లజాతి అహంకారానికి వ్యతిరేకంగా నల్ల జాతీయులు (నీగ్రోలు) చేస్తున్న పోరాటాన్ని థామస్ పేన్ రాసిన మనిషి హక్కుల పుస్తకం నుంచి అర్థం చేసుకున్నాడు.  యూరప్, అమెరికాలో ప్రజాస్వామ్యం మానవ సమాన హక్కుల సూత్రంపై  రాజరికాలకు వ్యతిరేకంగా వచ్చిన పోరాటాలతో  ఏర్పడ్డాయి.

భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే కులాల  అసమానతను కూలగొట్టి అందరికీ సమానవిద్య, పూజారి హక్కు, ఉద్యోగ హక్కు ఉండాలనేది  కీలకం. ఫూలేలు అది గమనించారు. వారు సత్య శోధక ఉద్యమం ఆ లక్ష్యం కోసం పుట్టింది. ఆర్యులు వచ్చిన తరువాత నిర్మించిన వ్యవస్థను శూద్ర– దళిత వ్యతిరేక, అణచివేత వ్యవస్థగా, ఉత్పత్తి వ్యతిరేక వ్యవస్థగా రూపొందిందని ఫూలే దుయ్యబట్టాడు. 

ఫూలే స్థాపించిన సత్య శోధక సమాజ్​ను బాల గంగాధర్​ తిలక్​ తీవ్రంగా వ్యతిరేకించారు. శూద్రులకు, దళితులకు, స్త్రీలకు చదువు చెప్పడాన్ని ఆయన వ్యతిరేకించారు.  బ్రిటిష్​ వారికి వ్యతిరేకంగానే కాదు, సామాజిక మార్పుకు వ్యతిరేకంగా కూడా హింసాయుత ఎత్తుగడలను సమర్థించాడు. ఈయన అతివాద ధోరణిని సావర్కర్​ ముందుకు తీసుకెళ్లాడు.
 
సావర్కర్​ హిందూత్వ
సావర్కర్, తిలక్ వాదనలకు ఒక బలమైన సిద్ధాంత రూపం, భవిష్యత్​  ఆచరణను ఈ పుస్తకంలో  పొందుపరిచాడు.  హిందూ మహాసభ  కేవలం బ్రిటిష్​ వ్యతిరేక లక్ష్యంతోనే  ఆయన  స్థాపించాలనుకోలేదు. దాన్ని శూద్ర– అతి శూద్రులు  ఏ మార్పు కోసమైతే  పోరాడాలని  ఫూలే  సిద్ధాంతీకరించాడో ఆ మార్పును పూర్తిగా వ్యతిరేకించే సిద్ధాంతం ఈ పుస్తకంలో ఉంది. ఆ సిద్ధాంతాన్ని అమలుపర్చడం ఇప్పుడు మోహన్​ భగవత్​ తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. 

ఆర్ఎస్ఎస్​లో పనిచేసే శూద్రులుగాని, దళితులుగాని,  ఆదివాసులుగాని సావర్కర్ రచనలు అసలు చదివినట్లు లేరు.  ఆ సంస్థల బయట ఉన్న శూద్రులు కూడా చదవకపోవడం వల్ల ఫూలే తత్వం గురించిగాని, దానికి వ్యతిరేకంగా రాసిన సావర్కర్​ తత్వం గురించిగాని వారికి అవగాహన లేదు.

సావర్కర్​ఆర్య ధర్మ, వర్ణ ధర్మ, హిందూత్వ దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలంటే ముస్లిం, క్రిస్టియన్ మతస్తులకు వ్యతిరేకంగా శూద్రులను, దళితులను తమ అధీనంలో సమీకరించాలని భావించాడు.  హిందూ మహాసభ కేవలం బ్రాహ్మణ మేధావులతో ప్రారంభమైన సంస్థ. ఆ తరువాత 1925లో  ఆర్ఎస్ఎస్​ కూడా బ్రాహ్మణ మేధావులతోనే ప్రారంభమైంది. చాలాకాలం వరకు శూద్రులు, దళితులు, ఆదివాసులను ఆ సంస్థలో సమాన స్థాయిలో చేర్చుకోవాలనే కుల వ్యతిరేక సిద్ధాంతం కూడా వారికి లేదు.

సావర్కర్​ రచనల్లో కుల వ్యవస్థ రద్దుపరిచి, ఉత్పత్తి రంగాలైన వ్యవసాయ రంగంలో,  కుటీర  పరిశ్రమల్లో పనిచేసేవారికి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలతో సమాన హక్కును కల్పించాల్సిన చారిత్రక అవసరాన్ని సావర్కర్ తన రచనలలో ఎక్కడా పేర్కొనలేదు. నామమాత్రంగా కులాంతర పెళ్లిళ్ల  అవసరాన్ని మొత్తం పుస్తకంలో ఒక చోట ప్రస్తావించి వదిలేశాడు.

బలమైన హిందూ దేశం
మతం పునాదిగా ప్యాన్  ఇస్లామ్,  ప్యాన్​  క్రిస్టియానిటీని ఎదిరించగలిగే బలమైన హిందూదేశంగా ఈ దేశాన్ని నిర్మించాలని ఆయన పదే పదే రాశాడు.  కానీ, కుల అసమానతలు, మతంమీద ఒక చిన్న కులమైన బ్రాహ్మణ పెత్తనం, బిజినెస్​ మీద బనియా పెత్తనం ఇపుడున్న ప్రజాస్వామ్యం కూడా మార్చలేదు. 

ఆర్ఎస్ఎస్, బీజేపీలు అధికారంలో ఉన్న 16 సంవత్సరాలలో (ఐదేండ్లు వాజ్​పేయి, పదకొండేండ్ల మోదీ పాలన) హిందూ మతం మీద, యూనివర్సిటీల మీద, రీసెర్చ్​ సెంటర్ల మీద  బ్రాహ్మణ పెత్తనం ఎన్నోరెట్లు పెరిగింది. ఆర్ఎస్ఎస్​లో  కార్యకర్తలుగా  పనిచేసే శూద్రులు, దళితులు, ఆదివాసులు  కూడా బ్రాహ్మణులతో సమానంగా నిలబడే పరిస్థితి లేదు. జాట్​లు, పటేళ్లు,  గుజ్జర్లు,  కమ్మలు,  రెడ్లు,  వెలమలు కూడా మతంలో బ్రాహ్మణులతో అన్ని రంగాల్లో సమానంగా లేరు. 

బిజినెస్ దేశ స్థాయిలో 50 శాతానికిపైన బనియాల చేతిలో ఉంది. సాఫ్ట్​వేర్​ బిజినెస్ అంతా బ్రాహ్మణుల చేతిలో ఉంది. సావర్కర్​ ఇంగ్లాండుకు పోయి సూటు, బూటు ధరించి, ఇంగ్లిషులో పై చదువులు చదువుకుని, పుస్తకాలు రాస్తే ఆయనే  హిందూత్వ  రాజ్య  జాతిపిత అని చెబుతూ  శూద్రులు, దళితులు  ఇంగ్లిషు  నేర్చుకుంటే  విదేశీ తొత్తులని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 

వీరి అసలు ఆలోచన శూద్రులు,  దళితులు,  ఆదివాసులు  బ్రాహ్మణ బనియా స్థాయికి రాకూడదనేది. ముస్లింలు, క్రిస్టియన్లను ఇంగ్లిషులో చదవకుండా,  ప్రపంచ పౌరులుగా  బతకకుండా వీళ్లు ఆపలేరు.  నార్త్ ఈస్ట్​  ఆదివాసులు  చైనావారిలా కనపడితే   వారిమీద  దాడులు చేస్తున్నారు. ఈ మధ్యనే   ఒక నార్త్ ఈస్ట్​ యువకుడిని ఈ ఆలోచనల ప్రభావంతో చంపారు. 

దేశ పౌరులపై దాడులు చేస్తే ఐక్యత ఎలా సాధ్యం ?
సావర్కర్ హిందూ రాష్ట్ర ఐక్యత ఇటువంటి దేశ పౌరులపై దాడులు చేస్తే ఎలా సాధ్యం అవుతుంది? ఈ అన్నింటికి కారణం కుల వ్యవస్థ.  అది గమనించిన ఫూలే  తన  రచనలో  కులాన్ని బలహీనపరిచి  ఎలా 
ప్రజాస్వామిక వ్యవస్థ రూపొందించవచ్చో చూపించాడు. సావర్కర్​ అందుకు భిన్నంగా ఆర్య ధర్మ,   వర్ణ ధర్మ, హిందూ రాష్ట్ర నిర్మాణం ప్రతిపాదించాడు.  ఆర్ఎస్ఎస్​  దాన్ని అమలులోకి తేవాలంటుంది.  దేశంలో ప్రధాన సమస్య 4 వేల ఏండ్లు కుల వ్యవస్థతో అణచివేయబడ్డ శూద్ర, దళిత, ఆదివాసీ  ప్రజా బాహుళ్యాల  సమానత్వం. అయితే వీరిలో  ఇంగ్లిషు విద్య లేదు గనుక మూల సమస్యను అర్థం చేసుకునే మేధావులు ఎదగలేదు. 

ఆర్ఎస్ఎస్, బీజేపీల్లో  పనిచేసే శూద్రులు, దళితులలో దేశ, ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన సావర్కర్​లాంటి మేధావులు ఎందుకు ఎదగలేదు?  ఆ సంస్థలు వారిని ఎదగనివ్వవు. మేధావితనమంతా బ్రాహ్మణుల చేతిలో ఉండాలి, ధనం వైశ్యుల చేతిలో ఉండాలనేది వారి సిద్ధాంతం.  దీన్ని  అర్థం  చేసుకోకుండా సావర్కర్​  సిద్ధాంత  వెలుగులో నిర్మించబోయే  హిందూ రాష్ట్రంలో ఆ సంస్థల్లో  పనిచేసే శూద్ర, దళిత, ఆదివాసులకు కూడా సంపూర్ణ సమానత్వం రాదు. అందుకే సావర్కర్​  రచనలు  చదవండి. 

మతంలో సమానత్వం సమస్య
ఫూలే దంపతులు శూద్ర, దళిత ఆడ, మగ పిల్లలకు చదువు చెప్పడానికి ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో సావర్కర్​కు తెలుసు. అంతేకాక కులాంతర వివాహాలు జరిపించడానికి వాళ్లు కోర్టు కేసులను కూడా ఎదుర్కొన్నారు. బ్రాహ్మణ పూజారి వర్గం ఏ రకమైన సంఘ సంస్కరణలను అంగీకరించలేదని తెలుసు. అయితే, కనీసం రాజారాం మోహన్​రాయ్​లాగ కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలలో సంస్కరణలు చేపట్టి  హిందూ వ్యవస్థను ఐక్యపర్చాలని ఆయన పేర్కొనలేదు. హనుమంతుడు రామునితో కలవడంతో ఆర్యులు, ద్రవిడుల మధ్య వైరుధ్యం పోయిందని ఒకచోట చెప్పాడు.

రామాయణాన్ని ఒక చరిత్ర పుస్తకంగా చూసే ప్రక్రియ చాలామంది బ్రాహ్మణ రచయితలలో కనిపిస్తుంది. అయితే, వ్యవసాయ ఉత్పత్తికి పునాది శక్తిగా ఉన్న శూద్రులను  అందులో గుర్తించిన ఆధారాలే లేవు.  కనుక  తాత్కాలికంగా కొన్ని కథల చుట్టూ,  దైవ నమ్మకాల చుట్టూ అవమానాలు,  అసమానతను భరించే కులాలను కొంతకాలం  వెంట తీసుకుపోవచ్చుగాని మతంలో కూడా సమానత్వం సమస్యను ముందుకు తేకుండా, లౌకిక వ్యవస్థను దెబ్బతీసి ఈ దేశాన్ని ఐక్యంగా నిలబెట్టుకోలేం.

ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్