మధ్యప్రదేశ్ శకటంలో కంగనా..! నిజమేనా..?

మధ్యప్రదేశ్ శకటంలో కంగనా..! నిజమేనా..?

జనవరి 26, శుక్రవారం రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మహిళా సాధికారతను హైలైట్ చేస్తూ ఢిల్లీలోని కర్తవ్య మార్గంలో 26 రాష్ట్రాలు తమ శకటాలను ప్రదర్శించాయి. అందులో భాగంగా మధ్యప్రదేశ్  దాని శకటంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను కూడా ప్రదర్శించారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది.. నిజంగా కంగనా విగ్రహాన్ని శకటంపై రూపొందించారా.. అన్న విషయాన్ని గమనిస్తే..

మధ్యప్రదేశ్ దాని సంక్షేమ పథకాల ద్వారా నేరుగా అభివృద్ధి ప్రక్రియలో మహిళల ఏకీకరణ, రాష్ట్రం సాధించిన విజయాన్ని శకటంపై ప్రదర్శించింది. ఈ శకటంలో భారత వైమానిక దళం (IAF)కి చెందిన మధ్యప్రదేశ్ తొలి మహిళా ఫైటర్ పైలట్ అవని చతుర్వేది కూడా ఉన్నారు. ఫైటర్ ప్లేన్ మోడల్ పక్కన అవని విగ్రహాన్ని ఉంచారు. ఈ శకటానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారాయి.

ఆన్ లైన్ లో ఈ శకటం విజువల్స్ వెలువడగానే నెటిజన్లు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో అవని చతుర్వేదిని పోల్చడం మొదలుపెట్టారు. కంగనా నటించిన, ఇటీవల విడుదలైన చిత్రం తేజస్‌లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రను పోషించిందని, ఆమె పాత్రను శకటంలో ప్రదర్శించినట్లు కొందరు నెటిజన్లు భావించారు. Xలో ANI షేర్ చేసిన వీడియోపై స్పందించిన యూజర్స్.. శకటంలో కంగనా విగ్రహాన్ని పెట్టారా అని ప్రశ్నించారు. ఇందులో ఉన్న కంగనానేనా అంటు పలువురు తమ అనుమానాలు వ్యక్తం చేశారు.

తేజస్ అనేది ఇటీవల విడుదలైన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్. ఈ మూవీలో కంగనా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపించింది. దీనికి సర్వేష్ మేవారా రచన, దర్శకత్వం వహించారు, రోనీ స్క్రూవాలా నిర్మించారు. అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మిశ్రమ స్పందనను దక్కించుకున్న ఈ సినిమా.. జనవరి 5న OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది.