ఈ నెల 18నుంచి కంటివెలుగు పథకం

ఈ నెల 18నుంచి కంటివెలుగు పథకం

హైదరాబాద్, వెలుగు: కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం కోసం ఒక్కో టీమ్‌‌లో పది మందితో మొత్తం 1,500 టీమ్‌‌లను ఏర్పాటు చేశారు. ఈ నెల18న కంటివెలుగును సీఎం ప్రారంభించనుండగా.. జూన్ 15 వరకూ వంద రోజుల పాటూ కొనసాగనుంది. తొలి దశలో పెట్టినట్టే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో క్యాంపులు పెట్టాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో 12,768 క్యాంపులు, పట్టణ ప్రాంతాల్లో 3,788 క్యాంపులు నిర్వహించనున్నారు. 

ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ క్యాంపులు నిర్వహించనున్నారు. టెస్టుల కోసం క్యాంపునకు వచ్చే ప్రజల ఊరు, పేరు, ఫోన్ నంబర్‌‌‌‌ తదితర వివరాలన్నీ నమోదు చేసేందుకు యాప్ కూడా రూపొందించారు. రీడింగ్ గ్లాసులు అవసరమైతే క్యాంపులో ఇవ్వనున్నారు. ఒకవేళ సైట్‌‌కు సంబంధించిన గ్లాసులు ఇవ్వాల్సి వస్తే, 15 రోజుల వ్యవధిలో గ్లాసులు అందజేయాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నారు.

 మరోవైపు కంటివెలుగు రెండో దశ కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు మంత్రులు హరీశ్‌‌రావు, కేటీఆర్‌‌, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు క్లాసులు తీసుకోబోతున్నారు. క్యాంపుల ఏర్పాటు, జనాల మొబిలైజేషన్‌‌, అద్దాల పంపిణీ తదితర అంశాలపై మంత్రులు సూచనలు చేయనున్నారు. ఇందుకోసం మంగళవారం సాయంత్రం 5 గంటలకు సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కంటివెలుగుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు.