అయ్యర్, కిషాన్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు.. కపిల్ దేవ్, గంగూలీ ఏమన్నారంటే..?

అయ్యర్, కిషాన్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు.. కపిల్ దేవ్, గంగూలీ ఏమన్నారంటే..?

దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్స్‌ అయ్యర్‌పై బీసీసీఐ కొరఢా ఝుళిపించింది. ఈ ఇద్దరినీ కాంట్రాక్టుల నుంచి తొలగించింది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన కిషన్‌ ఆ తరువాత జరిగిన ఏ సిరీస్‌లోనూ ఆడలేదు. ఐపీఎల్‌ కోసం హార్దిక్‌ పాండ్యాతో కలసి ప్రాక్టీస్‌ చేశాడు. రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌ జట్టు ఆడాలని బీసీసీఐ..హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పినా ఇషాన్‌ కిషన్‌ వినలేదు.

అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో, బరోడాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆడాలని శ్రేయస్‌ అయ్యర్‌ను కోరినా అతడూ దూరంగా ఉన్నాడు. దీంతో బీసీసీఐ మాట లెక్క చేయని వీరిద్దరూ స్టార్ ప్లేయర్లయినప్పటికీ క్రమశిక్షణ తప్పిన కారణంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి పక్కన పెట్టేశారు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, గంగూలీ ఈ నిర్ణయాన్ని సమర్ధించారు. 

కపిల్ దేవ్ మాట్లాడుతూ.. దేశవాళీ క్రికెట్ ను కాపాడటానికి బీసీసీఐ తీసుకున్న కఠిన చర్యను నేను అభినందిస్తున్నాను. అంతర్జాతీయ క్రికెట్‌లో తమ సుస్థిరం చేసుకున్న తర్వాత దేశీయ క్రికెట్‌ను ఆటగాళ్ళు దాటవేయడం చూసి బాధపడ్డాను అని 1983 ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. కొంతమంది బాధపడినా.. దేశం కంటే ఎవరూ ఎక్కువ కాదని కపిల్ దేవ్ అన్నారు.  

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అయ్యర్, కిషాన్ రంజీ ట్రోఫీని ఆడకుండా వారు తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యపోయానని అన్నారు. ఇది ప్రీమియర్ టోర్నమెంట్ అందరూ ఖచ్చితంగా ఆడాలి. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదే అనుకుంటున్నాను. కాంట్రాక్ట్‌లో ఉన్న ప్రతి క్రికెటర్‌ తప్పనిసరిగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలి. అని గంగూలీ రెవ్‌స్పోర్ట్జ్‌తో అన్నారు.