కారేపల్లి, వెలుగు : ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఖమ్మం జిల్లా కారేపల్లి ఆర్‌ఐ దౌలూరి శుభకామేశ్వరీ దేవిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం మీ –సేవలో అప్లై చేసుకున్నాడు. జీపీవోతో సంతకం చేయించుకున్న అనంతరం ఆర్‌ఐ శుభకామేశ్వరీ దేవిని కలిశాడు.
ఆమె సర్టిఫై చేసి పైఆఫీసర్‌కు పంపించేందుకు రూ. 10 వేలు డిమాండ్ చేసింది. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం ఆర్‌ఐకి ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పడంతో.. ఆమె ఇంటి వద్దకు రావాలని సూచించింది. దీంతో అతడు ఆర్‌ఐ ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు ఆర్‌ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
