కిలోన్నర వెండితో తీగల పల్లకి

కిలోన్నర వెండితో తీగల పల్లకి

కరీంనగర్,వెలుగు: మన సిల్వర్ ఫిలిగ్రికి మరోసారి జాతీ య గుర్తింపు ద క్కింది. కరీంనగర్​కు చెందిన ఫిలిగ్రి కళాకారుడు గద్దె అశోక్ కుమార్ కిలోన్నర వెండితో తయారు చేసిన తీగల పల్లకీ జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది.  2018లో అశోక్ కుమార్ దీన్ని తయారు చేసి ఢిల్లీలోని జాతీయ చేతి కళల అభివృద్ధి సంస్థకు పంపించారు. కరోనా కారణంగా అవార్డుల పంపిణీ ఆలస్యమైంది.

కేంద్ర  టెక్స్ టైల్స్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్ కుమార్​కు అవార్డును బహూకరించనున్నారు. వెండి నగిషీ వస్తువుల తయారీలో కరీంనగర్​కు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. దేశ, విదేశీ అతిథులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే ఫిలిగ్రి కళారూపాలను కరీంనగర్​లోనే తయారు చేయిస్తారు. గద్దె అశోక్ కుమార్ సిల్వర్​ ఫిలిగ్రి ఆఫ్​ కరీంనగర్​ సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.