పిల్లలు వద్దనుకుంటే 'ఊయల' లో వదలండి : కలెక్టర్ పమేలా సత్పతి

పిల్లలు వద్దనుకుంటే 'ఊయల' లో వదలండి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు: పుట్టిన శిశువును వద్దనుకునేవారు సిటీలోని ఎంసీహెచ్‌‌లో ఏర్పాటుచేసిన  ఊయల (క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్)లో వదిలివెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం ప్రభుత్వ హాస్పిటల్‌‌లోని ఎంసీహెచ్‌‌లో మహిళా, శిశు, సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశువుల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువులను వద్దనుకునేవారు ‘ఊయల’ సెంటర్‌‌‌‌ను ను సద్వినియోగం చేసుకోవచ్చని, ఇక్కడ శిశువులను అప్పగించిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. నేరుగా శిశువును అప్పగించాలనుకునేవారు 9490881098కు సమాచారం ఇవ్వొచ్చన్నారు. 

త్వరలో జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ‘ఊయల’ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌‌డేలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయా సమస్యలపై వచ్చిన సుమారు 264 అప్లికేషన్లను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్‌‌ నిర్వహించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రాజీవ్ యువవికాసం వంటి ప్రభుత్వ పథకాల అమలును స్పీడప్‌‌ చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఎంహెచ్‌‌వో వెంకటరమణ, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీన, డీడబ్ల్యూవో సరస్వతి పాల్గొన్నారు.