
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ బల్దియా పరిధిలోని మానేరు రివర్ ఫ్రంట్ పనులకు నదికి ఇరువైపులా భూ సేకరణను స్పీడప్ చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్‌ప్రకాశ్, ఇరిగేషన్, రెవెన్యూ, హైవే అథారిటీ అధికారులతో వేర్వేరుగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానేరు రివర్ ఫ్రంట్, హైవే 563 విస్తరణకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు.
భూములు కోల్పోయిన వారికి అందిన పరిహారం, మార్కెట్ రేటు, భూమి అప్పగించకపోవడానికి కారణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గణేశ్నిమజ్జన ప్రాంతాలైన మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్‌ను సీపీ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 5న నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, హైవే అథారిటీ రీజనల్ ఆఫీసర్ శివశంకర్, వరంగల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, తదితరులు
పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
కరీంనగర్ రూరల్, వెలుగు: ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని కలెక్టర్ పమేలా సత్పతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పరిధిలోని 728 సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమికి పక్కాగా హద్దులు నిర్ణయించాలని, ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను తొలగించాలన్నారు.