
- మీటింగ్‌లలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు
- విద్యాశాఖకు సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
కరీంనగర్, వెలుగు : ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే కరీంనగర్ డీఈవో జనార్దన్‌రావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల టీచర్లకు నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే పలు సందర్భాల్లో ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో కొందరు మహిళా హెచ్‌ఎంలు మంగళవారం కరీంనగర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కలెక్టర్ పమేలా సత్పతి డీఈవోను విద్యాశాఖకు సరెండర్ చేస్తూ మంగళవారం రాత్రి ఆర్డర్స్ జారీ చేశారు.
కరీంనగర్ మీటింగ్‌లో అనుచిత వ్యాఖ్యలు
కరీంనగర్ కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో సర్కార్ టీచర్లకు ఐదు రోజులపాటు నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం ఈ నెల 24న జరిగింది. కార్యక్రమానికి కరీంనగర్ డీఈవో సీహెచ్‌వీఎస్. జనార్దన్‌రావు హాజరై మాట్లాడుతూ... ‘ఆడ లేదు.. మగ లేదు.. అందరికీ వంట రావాలి, వంట నేర్చుకోవాల్సిందే... భవిష్యత్‌లో మీ పిల్లలందరికీ చెప్పండి.. ముఖ్యంగా అబ్బాయిలకు.. వంట రాకపోతే మీ ఆవిడ ఉండదురా బాబు... లేచిపోతుంది’ అని చెప్పండి అని సూచించారు.
‘వంట వచ్చినా అలిగి చేస్తే అది చెడిపోతుంది.. అలాగే మనకు చదువు వచ్చి కూడా చెప్పకపోతే అలిగినట్లే లెక్క’ అన్నారు. అక్కడే ఉన్న డీటీఎఫ్ నాయకుడితో పాటు కొందరు మహిళా టీచర్లు డీఈవో వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ‘ఇందులో ఎవరూ ఎవరిని ఇన్‌సల్ట్ చేయాల్సింది ఏమీ లేదు, మనకు పని వచ్చినా చేయకపోతే సమాజానికి రాంగ్ మెస్సేజ్ ఇచ్చినట్లు అవుతుంది, నేను ఎవరినీ కించపరచడానికి మాట్లాడట్లేదు’ అంటూ ముగించారు.
గతంలో ఓ సెక్టోరియల్ ఆఫీసర్‌తోనూ...
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి డీఈఓగా వ్యవహరిస్తున్న జనార్దన్‌రావు గతంలో ఆ జిల్లాల్లో నిర్వహించిన మీటింగ్‌లలోనూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ జిల్లాలో నిర్వహించిన హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషోపాధ్యాయుల సమావేశంలో తనతో ఫొటో దిగడానికి వచ్చిన ఓ సెక్టోరియల్ ఆఫీసర్‌తో అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీటింగ్ ముగిసే సమయానికి సదరు మహిళా ఆఫీసర్ ఫొటో దిగేందుకని రాగా.. ‘ఒక్కటి కాకపోతే పది దిగండి.. అందరూ తీసుకుంటున్నరు.. అది మనం పెట్టుకోవడానికి ఉంటది... ఇష్టమున్నా లేకున్నా’ అని వ్యంగ్యంగా అన్నారు. దీంతో సదరు ఆఫీసర్ స్పందిస్తూ ‘హా.. అట్లా ఎట్ల సార్’ అని అనడంతో.. ‘మాములుగానే అంటున్నా.. ఇప్పుడు పెళ్లాం మొగుడు పక్కపక్కన ఫొటో దిగుతారండి.. ఇష్టముండే దిగుతామా’ అని అనుచిత, అసందర్భ వ్యాఖ్యలు చేశారు.
దీంతో ‘పెయిర్స్ వేరు.. ఎంప్లాయీస్ వేరు’ అని ఆఫీసర్ అనడంతో వెంటనే ‘మీరు నాకు చెల్లెలితో సమానం’ అంటూ కవర్ చేశారు. ఇదే సమావేశంలో డీఈవో మాట్లాడుతూ..‘రెండు సంసారాలు ఉన్నాయి నాకు.. ఒక సంసారం ఈదడమే కష్టమైతది.. కానీ రెండు సంసారాలు ఈదడం ఎంత కష్టమో అనుభవించే వాడికే తెలుస్తది.. అనుభవించినవారే చెప్తరు పెళ్లి చేసుకోవద్దురా నాయనా అని.. నువ్వు చేసుకోలేదా అని ఎదుటి వ్యక్తి అడుగుతడు.. వాడికి కూడా పెళ్లి చేసుకున్నాకే తెలుస్తది’ అని చెప్పుకొచ్చారు.
డీఈవోను సరెండర్ చేస్తూ ఆర్డర్స్
అనుచితంగా, అసభ్యకరంగా మాట్లాడిన డీఈవో జనార్దన్‌రావుపై కలెక్టర్ పమేలా సత్పతి చర్యలు తీసుకున్నారు. ఆయనను విద్యాశాఖకు సరెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఆర్డర్స్ జారీ చేశారు. ఆయన స్థానంలో డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే తన మాటలు వివాదాస్పదం కావడం, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకుంటారని గ్రహించిన డీఈవో జనార్దన్ రావు మంగళవారం ఉదయమే లాంగ్ లీవ్‌లో వెళ్లారు. జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్‌రెడ్డికి చార్జ్ ఇచ్చినట్లు సమాచారం.