వరుణ దేవా కరుణించవా...కరీంనగర్లో కప్పతల్లి ఆటలు..

వరుణ దేవా కరుణించవా...కరీంనగర్లో కప్పతల్లి ఆటలు..

వానలు కురవాలి.  పంటలు బాగా పండాలని వేడుకుంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో కప్పతల్లి ఆటలు ఆడుతూ గ్రామంలోని దేవుళ్లకు పూజలు చేశారు. రోకలి బండకు కొత్త గుడ్డలో ఒక కప్పను కట్టి, దానిని రోకలిబండ మధ్యలో వేలాడదీసి, ఆ కప్పను పసుపు, కుంకుమలతో అలంకరించి ఊరేగించారు.  గ్రామంలో ప్రతి ఇంటినుంచి బిందెలలో నీళ్లు తీసుకొచ్చి గ్రామంలో ఆలయాలలో ప్రత్యేకంగా అభిషేకం చేసి, పూజలు నిర్వహించారు.

ALSO READ:బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో ఈదరు గాలులతో కూడిన భారీ వర్షాలు


వర్షాలు కురవాలి వానదేవుడో ..పంటలు బాగా పండాలి వానదేవుడో” అంటూ పాటలు పాడారు.  రోకలి పట్టుకుని వాడ వాడ తిరిగారు.  వర్షాలు కురవాలని  ఇల్లిల్లూ తిరుగుతూ  కప్పతల్లిపై నీళ్ళు పోస్తూ వరుణ దేవుణ్ణి వేడుకున్నారు. వర్షాలు కురిపించి గొడ్డూ, గోదా సకలజనులు సుభిక్షంగా ఉంచాలని వరుణ దేవునికి పూజలు చేశారు. డప్పు చప్పులతో గ్రామంలోని పోచమ్మ, ఎల్లమ్మ, ఆంజనేయస్వామి, వెంకటేశ్వరస్వామి, శివుని ఆలయాల్లో జలాభిషేకం చేశారు.