గన్నేరువరం, వెలుగు : టెన్త్ స్టూడెంట్ స్కూల్‌లోనే గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని జడ్పీహైస్కూల్‌లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన బోయిని సాయికుమార్ స్థానికంగా ఉన్న స్కూల్‌లో టెన్త్ చదువుతున్నాడు.
మూడు రోజుల కింద స్కూల్ ఆవరణలోకి పాము రావడంతో దానిని స్టూడెంట్లు చంపేశారు. చనిపోయిన పామును బాలికలకు చెందిన టిఫిన్ బాక్స్‌లో సాయికుమార్ పెట్టాడు. దీంతో ఆందోళనకు గురైన స్టూడెంట్లు విషయాన్ని హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన సాయికుమార్ పేరెంట్స్‌కు విషయం చెప్పడంతో వారు.. అతడిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ మంగళవారం స్కూల్‌కు వచ్చాక క్లాస్‌రూంలోనే గడ్డి మందు తాగాడు. గమనించిన మిగతా విద్యార్థులు టీచర్లకు చెప్పడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించి.. వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం సాయికుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నా.. 24 గంటలు గడిస్తేనే ప్రాణాపాయం తప్పుతుందని డాక్టర్లు తెలిపారు.
