ఎంపీగా ఏం చేశాడో నిలదీయండి : గంగుల కమలాకర్

ఎంపీగా ఏం చేశాడో నిలదీయండి  : గంగుల కమలాకర్
  • ఎన్నికలు రాగానే హాస్పిటల్ డ్రామాలాడే ఆర్టిస్ట్ సంజయ్
  •     బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి  గంగుల కమలాకర్ 

కరీంనగర్, వెలుగు: నాలుగున్నరేళ్లు ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశాడో నిలదీయాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్, ఎలబోతారం గ్రామాలతోపాటు సిటీలోని 10, 31, 47, 50 డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి గంగుల మాట్లాడుతూ ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పి హాస్పిటల్ డ్రామాలు ఆడే ఆర్టిస్ట్ బండి సంజయ్ అని విమర్శించారు. 

ప్రజలకు సేవ చేయమని ఎంపీగా గెలిపిస్తే నాలుగున్నరేళ్లు పత్తా లేకుండా పోయి.. అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఇప్పుడు ఓట్లు కొనేందుకు వస్తున్నాడని మండిపడ్డారు. ఎంపీగా టికెట్ ఇవ్వబోమని బీజేపీ హైకమాండ్​ తెగేసి చెప్పడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటుకు రూ.20 వేలు, సెల్ ఫోన్ ఇస్తానని మభ్యపెడుతున్నాడన్నారు. 

ఆయన ఇచ్చే డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అండగా ఆంధ్రోళ్లు ఉన్నారని, కేసీఆర్ కు అండగా తెలంగాణ ప్రజలు ఉండాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్ల దారిద్ర్యానికి ఈ బీజేపీ, కాంగ్రెస్ లేనని కారణమని.. మళ్లీ ఆ దారిద్ర్యం కావాలా..  పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి కావాలా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. అంతకుముందు ప్రచారంలో డప్పుచప్పుళ్లతో ప్రజలు గంగులకు ఘనంగా స్వాగతం పలికారు. 

ఒగ్గు కళాకారులు నృత్యాలు అలరించాయి. ప్రచారంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, కార్పొరేటర్లు, లీడర్లు షార్ఫుద్దీన్ , బాబుజాని, స్వప్న వేణు, అంజయ్య,శ్రీధర్, ప్రశాంత్, ఉమాపతి, రవీందర్ పాల్గొన్నారు.