- మంత్రి శ్రీధర్ బాబు
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్‌లో 42 స్థానాల్లో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్‌లోని అలుగునూర్(8వ డివిజన్)లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలుగునూర్ చౌరస్తాను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు అందిస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని, బీజేపీ–బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే సత్యనారాయణ, డాక్టర్ అనురాధ, మాజీ ఎమ్మెల్యే మోహన్, సుడా చైర్పర్సన్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కేంద్రం విధానాలతో బంగారం పిరం..
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బంగారం, వెండి అందుబాటులో లేకుండా పోతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ధరలు ఆకాశాన్నంటడానికి కారణం ఏమిటో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లోని రాంనగర్, టెలిఫోన్ క్వార్టర్స్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. త్వరలోనే కరీంనగర్ డంపింగ్ యార్డును తరలిస్తామని తెలిపారు.
