
- కరీంనగర్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్పోర్ట్స్‌కాంప్లెక్స్, స్ట్రీట్ వెండర్స్ షట్టర్లకు తాళాలు
- ప్రారంభించి ఐదు నెలలైనా తెరుచుకోని దుస్థితి
- పదేళ్లుగా ఖాళీగానే మున్సిపల్ గెస్ట్ హౌస్ షట్టర్లు
కరీంనగర్, వెలుగు: స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి.. అన్ని హంగులతో నిర్మించిన కొన్ని బిల్డింగ్స్, షట్టర్లు నిరుపయోగంగా మారాయి. ఈ ఏడాది జనవరి 22న కేంద్ర, రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించిన కరీంనగర్ పద్మానగర్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అంబేద్కర్ స్టేడియంలోని స్టోర్ట్స్ కాంప్లెక్స్, శాతవాహన యూనివర్సిటీ, సివిల్ హాస్పిటల్ ఏరియాలో స్ట్రీట్ వెండర్స్ కోసం కేటాయించిన షట్టర్లు ఇంకా వినియోగంలోకి రాలేదు. పదేళ్ల కింద నిర్మించిన మున్సిపల్ గెస్ట్ హౌస్ లోని 26 షట్టర్లు అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి నిర్మించడం, తీరా ప్రారంభించాక వినియోగంలోకి తీసుకురాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.16 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్
కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం కాంపౌండ్‌లో స్మార్ట్ సిటీ ఫండ్స్ రూ.16 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అద్దెకు తీసుకునేవారు లేక అలంకారప్రాయంగా మారింది. ఇందులో 22 కమర్షియల్ షట్టర్లతోపాటు హోటల్, హోటల్ రూమ్స్, బాంకెట్ హాల్ ఉన్నాయి. ఇందులో మొత్తం 24,778 స్వ్కైర్ఫీట్స్ కమర్షియల్ స్పేస్ ఉంది. ఈ కాంప్లెక్స్ మొత్తం కలిపి నెలకు రూ.10.50 లక్షలకు అద్దెకు ఇచ్చేందుకు ఇప్పటికే రెండుసార్లు మున్సిపల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏడాది అడ్వాన్స్ రూ.1.26 కోట్లు, ఈఎండీ కింద రూ.15 లక్షలు ముందే చెల్లించాలనే కండీషన్ తో గిట్టుబాటు కాదనే భయంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఈ కాంప్లెక్స్ లోని షట్టర్లు, హోటల్, రూమ్, బాంకెట్ హాల్ లీజ్ కు వేర్వేరుగా నోటిషికేషన్ ఇవ్వాలని మున్సిపల్ ఆఫీసర్లు నిర్ణయిచినట్లు తెలిసింది.
పదేళ్లుగా అలంకారప్రాయంగా మున్సిపల్ గెస్ట్ హౌస్ షట్టర్లు..
కమర్షియల్‌గా ఖరీదైన ఏరియాలో ఉన్న మున్సిపల్ స్థలంలో పదేళ్ల కింద రూ.5 కోట్లతో మున్సిపల్ గెస్ట్ హౌస్ నిర్మించారు. ఇందులోని ఫస్ట్ ఫ్లోర్‌లో 26 షట్టర్లు ఉన్నాయి. మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకునేందుకు నిర్మించిన ఈ కాంప్లెక్స్.. పదేళ్లుగా నిరుపయోగంగానే ఉంది. ఈ షట్టర్ల విషయంలోనూ అప్పట్లో ఉన్న మున్సిపల్ ఆఫీసర్లు అడ్డగోలుగా అద్దెలు నిర్ణయించడంతోనే వ్యాపారులు ఎవరూ ముందుకు రానట్లు తెలిసింది. మళ్లీ ఇప్పటివరకు ఈ షట్టర్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కమర్షియల్‌గా ఎంతో డిమాండ్ ఉన్న ఈ ఏరియాలో ఏళ్ల తరబడి షట్టర్లను ఖాళీగా ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పద్మానగర్ మార్కెట్ మొదలుకాని దుకాణాలు..
కరీంనగర్ పద్మానగర్ లో కూరగాయలు, నాన్ వెజ్ దుకాణాలు ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద రూ.16.50 కోట్లతో నిర్మించారు. 2.08 ఎకరాల్లో నిర్మించిన ఈ మార్కెట్ లో 193 స్టాళ్లు ఉంటాయి. ఇందులో కూరగాయలు అమ్మే ప్లాట్‌ఫామ్ లు, నాన్ వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ స్టాళ్లు ఉన్నాయి. ఈ మార్కెట్‌ను జనవరి 22న కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బల్దియా ఆఫీసర్లు డ్రా నిర్వహించి చిరువ్యాపారులకు కేటాయించారు. ఇది జరిగి ఐదు నెలలైనా మార్కెట్ అందుబాటులోకి రాలేదు.
స్ట్రీట్ వెండర్ల షట్టర్లదీ అదే పరిస్థితి..
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ప్రహరీకి ఆనుకుని రేకుల కప్పుతో 126 షట్టర్లు, శాతవాహన వర్సిటీ ఏరియాలో మరో 25 షటర్లు నిర్మించారు. ఈ షాపులను కేటాయించేందుకు మార్చిలో రూ.1000 డీడీతో అప్లికేషన్లు స్వీకరించగా.. సివిల్ హాస్పిటల్ ఏరియా షట్టర్ల కోసం 797, యూనివర్సిటీలోని షట్టర్ల కోసం 295, మొత్తంగా 1092 అప్లికేషన్లు వచ్చాయి. డ్రా ద్వారా లబ్ధిదారులకు షట్టర్లు కేటాయించారు. కానీ వీటిలో మొత్తం 30 షట్టర్లు కూడా ఓపెన్ కాలేదు.