కరీంనగర్, వెలుగు: విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కళోత్సవ్ పోటీల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు నాలుగు ప్రథమ బహుమతులు సాధించారు. మొత్తం 12 రంగాల్లో పోటీలు నిర్వహించగా నాలుగు రంగాల్లోనూ కరీంనగర్ విద్యార్థులే విజయం సాధించడం విశేషం.
థియేటర్ ఆర్ట్స్ గ్రూపులో తిమ్మాపూర్ కేజీబీవీ విద్యార్థులు, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ గ్రూప్ లో వెన్నంపల్లి హైస్కూల్ విద్యార్థులు మొదటి స్థానం సాధించారు. అల్ఫోర్స్ స్కూల్ విద్యార్థి క్లాసికల్ సోలో పాటల విభాగంలో, పారమిత విద్యార్థి సంగీత విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. వీరంతా త్వరలో ఢిల్లీలో జరగబోయే జాతీయస్థాయి కళోత్సవ్ పోటీల్లో పాల్గొంటారు.
