మొండి బిట్టు ఆస్కార్‌‌ లిస్ట్‌‌లో..

మొండి బిట్టు ఆస్కార్‌‌ లిస్ట్‌‌లో..

ఆస్కార్‌‌ బరిలో మన సినిమాకి మరోసారి నిరాశ ఎదురైంది. ఎన్నో అంచనాలతో పంపించిన ‘జల్లికట్టు’ రిజెక్ట్ అయ్యింది. అయితే అనూహ్యంగా ఒక షార్ట్ ఫిల్మ్ ఆస్కార్‌‌ బరిలో నిలిచింది.  ‘బిట్టు’..  లైవ్‌‌ యాక్షన్‌‌ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మన దేశం తరపున చోటు దక్కించుకుంది. ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన ఈ బిట్టు కథేంటో చూద్దాం.

ఇద్దరు చిన్నారుల ఫ్రెండ్‌‌షిప్ కథతో తెరకెక్కిందే ‘బిట్టు’. అనుకోని పరిస్థితుల మధ్య ఆ ఇద్దరూ శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఏంటన్నది బిట్టు కథ.  కరిష్మా దేవ్ దూబే ఈ షార్ట్ ఫిల్మ్‌‌ను డైరెక్ట్ చేసింది. కథా ఆమే రాసింది. కో–ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరించింది దూబే.  బాలీవుడ్ ఫిల్మ్‌‌ మేకర్‌‌ ఏక్తా కపూర్‌‌, గునీత్ మోంగా, తహీరా కశ్యప్‌‌ కలిసి స్టార్ట్ చేసిన ‘ఇండియన్‌‌ ఉమెన్ రైజింగ్‌‌’..  బిట్టు షార్ట్ ఫిల్మ్‌‌కి సాయం అందించింది. కిందటి ఏడాది జూన్‌‌ 3న ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది. కంటెంట్‌‌.. కల్మషం లేని బిట్టూ, చాంద్‌‌ క్యారెక్టర్లు హార్ట్ టచింగ్‌‌గా అనిపిస్తాయి. అందుకే పద్దెనిమిది ఫిల్మ్‌‌ ఫెస్టివల్స్‌‌లో బిట్టూని స్క్రీన్‌‌ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆస్కార్‌‌ జ్యూరీని ఆకట్టుకుని లైవ్ యాక్షన్‌‌ షార్ట్ ఫిల్మ్‌‌ కేటగిరీలో టాప్‌‌ టెన్‌‌ లిస్ట్‌‌లో చోటు దక్కించుకుంది.

మొండి బిట్టు

బిట్టూ సింగ్‌‌..  కొండపై ఉండే స్కూల్‌‌లో చదువుకుంటోంది.  ఆమెకి నీట్‌‌గా ఉండడం ఇష్టం ఉండదు. స్కూల్‌‌లో తానే తోపు అని ఫీలవుతుంది.  ప్రతీ విషయాన్ని జోక్‌‌గా తీసుకుంటుంది.  కోప్పడితే ముఖం సీరియస్‌‌గా పెట్టుకుని ఓ మూలన కూర్చుంటుంది.  మార్చాలని టీచర్ ఎంత ట్రై చేసినా.. బిట్టు మారదు. అందుకే అంతా మొండిఘటం అంటారు. కానీ, బెస్ట్‌‌ ఫ్రెండ్‌‌ చాంద్ ఆమె బలహీనత.  కథ ఆరంభంలో బిట్టూ సింగ్‌‌, చాంద్‌‌లు  తమ వయసుకి మించిన పాటలు పాడుతూ కాలేజ్‌‌ స్టూడెంట్స్‌‌ను ఇంప్రెస్‌‌ చేస్తుంటారు. ‘వాహ్‌‌వా..’ అనుకుంటూ చిల్లర విసురుతుంటారు ఆ కుర్రాళ్లు.  ఆ చిల్లర ఏరుకుని బిట్టు, చాంద్‌‌లు సంతోషంగా ఓ ట్రక్కులో స్కూల్‌‌కి వెళ్తుంటారు. అలా వెళ్లే టైంలోనే వాళ్లిద్దరి మధ్య చిన్నగొడవ జరుగుతుంది.  అది మనసులో పెట్టుకుని చాంద్‌‌ మీద ఇంక్‌‌ పోస్తుంది బిట్టు. ఇద్దరూ తన్నుకుంటారు. పంచాయితీ ప్రిన్సిపాల్ దాకా వెళ్తుంది. ‘సారీ చెబితేనే మధ్యాహ్నం ఫుడ్ ఉంటుంద’ని ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇస్తుంది.  బిట్టు గురించి తెలిసిందే కదా.  కడుపు కాలుతున్నా పనిష్మెంట్‌‌నే భరిస్తుంది. అయితే ఆ మొండితనమే బిట్టు ప్రాణాలు నిలబెడితే.. చాంద్‌‌తో పాటు మిగతా పిల్లల ప్రాణాలు పోయేలా చేస్తుంది. అదేంటో తెలియాలంటే.. 17 నిమిషాల రన్‌‌ టైం ఉన్న  ‘బిట్టు’ను యూట్యూబ్‌‌లో చూడాల్సిందే.

సెలబ్రిటీల సపోర్ట్‌‌

ఈ షార్ట్ ఫిల్మ్‌‌లో బిట్టుగా రాణీ కుమారి, చాంద్‌‌గా రేణు కుమారి యాక్ట్ చేశారు. బిట్టు నేచురల్‌‌ పర్‌‌ఫార్మెన్స్‌‌కి చాలామంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్‌‌ షాట్‌‌లో..  చనిపోయిన చాంద్‌‌ చిటికెన వేలు పట్టుకుని బిట్టు అమాయకంగా ఆకాశం వంక చూడడం, మిగతా వాళ్లకు దూరంగా తన స్నేహితురాలిని తీసుకెళ్లి కాపాడుకునే ప్రయత్నం చేయడం లాంటి సీక్వెన్స్‌‌ ఆకట్టుకుంటాయి. ఈ షార్ట్‌‌ ఫిల్మ్‌‌ లైవ్ యాక్షన్‌‌ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో తర్వాతి రౌండ్‌‌కి వెళ్లడంపై కరిష్మా దేవ్‌‌ దూబే చాలా హ్యాపీగా ఉంది. బాలీవుడ్ స్టార్స్‌‌ విద్యాబాలన్‌‌, సంధ్య మృదుల్‌‌, ఫాతిమా సనా షేక్‌‌, ఆరతి కాదవ్‌‌.. షార్ట్ ఫిల్మ్‌‌ చూశారు. కంగ్రాట్స్​ చెబుతూ బిట్టు టీంకి  సపోర్ట్ ఇస్తున్నారు.
మరి ఈ షార్ట్ ఫిల్మ్‌‌ అవార్డు దక్కించుకుంటుందా? లేదా? తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి.