
కర్ణాటకలోని తుముకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కొరటగెరే నుండి తుమ్కూర్ వెళ్తున్న విజయలక్ష్మి అనే ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగరు అక్కడికక్కడే మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
ఈ ప్రాంతంలో ప్రైవేటు బస్సుల సంఖ్య పెరిగిపోతుందని, అనుభవం లేని డ్రైవర్ల కారణంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.