డిస్ క్వాలిఫై ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు

డిస్ క్వాలిఫై ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు

కర్నాటకలో జోరందుకోనున్న ఉపఎన్నికలు

న్యూఢిల్లీ: కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి సర్కారును కూలదోయడంలో కీలకపాత్ర పోషించి డిస్ క్వాలిఫై అయిన రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్ ఇచ్చింది. డిసెంబర్ 5న జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 13 మంది రెబల్ ఎమ్మెల్యేలను బరిలోకి దించుతామని ప్రకటించింది. మరో రెండు స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఇంకా ప్రకటించలేదు. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేస్తూ అప్పటి స్పీకర్ కేఆర్ సురేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని బుధవారం తీర్పు చెప్పింది. రెబల్ ఎమ్మె్ల్యేల కారణంగా విశ్వాస పరీక్షలో ఓడిపోయిన అప్పటి సీఎం హెచ్ డీ కుమారస్వామి రిజైన్ చేశారు. తర్వాత బీఎస్ యడియూరప్ప ఆధ్వర్యంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది.  మొత్తం 17 స్థానాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉండగా హైకోర్టులో వేర్వేరు కేసుల కారణంగా మస్కి, ఆర్ఆర్ నగర్ స్థానాలకు ఉపఎన్నికలు జరగట్లేదు. గురువారం 17 మంది డిస్ క్వాలిఫై ఎమ్మెల్యేల్లో 16 మంది  కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నళిన్ కుమార్ కటీల్, కర్నాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీధర్ రావు సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ.. “17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో నేను సీఎం అయ్యా. రెబల్స్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. 15 స్థానాల్లో గెలుపు మాదే. వీళ్లంతా ఫ్యూచర్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అవుతారు” అని అన్నారు. 224 మంది సభ్యులున్న కర్నాటక అసెంబ్లీలో బీజేపీ బలం 106 కాగా, జేడీఎస్, కాంగ్రెస్ కు 101 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ మార్క్ 113. బీజేపీ అధికారంలో కొనసాగాలంటే 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాలు గెలవాల్సి ఉంది.

Karnataka: BJP gives bypoll tickets to 13 disqualified MLAs