కాంగ్రెస్ వైపు సీపీఐ చూపు..పొత్తులపై మారిన కమ్యూనిస్టుల వ్యూహం

కాంగ్రెస్ వైపు సీపీఐ చూపు..పొత్తులపై మారిన కమ్యూనిస్టుల వ్యూహం
  • కాంగ్రెస్ వైపు సీపీఐ చూపు..
  • పొత్తులపై మారిన కమ్యూనిస్టుల వ్యూహం
  • కాంగ్రెస్సా.. బీఆర్ఎస్సా..? ఎవరితో కలుద్దాం!
  • తెలంగాణ పాలిటిక్స్ పై కర్నాటక ఫలితాల ఎఫెక్ట్ 
  • ఆ స్టేట్ లో 212 సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్న నారాయణ
  • కేసీఆర్ తో బంధంపై వేచి చూసే ధోరణిలో కామ్రేడ్స్
  • గులాబీ టీం స్పందించకుంటే మారనున్న ఈక్వేషన్స్

హైదరాబాద్ : కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వ్యూహం మార్చుకొనే పరిస్థితి కనిపిస్తోంది. మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన సీపీఐ రాబోయే ఎన్నికల్లో ఎవరితో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతుందనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన కామెంట్స్ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తెలంగాణ పొత్తులపై పునరాలోచిస్తున్నామని, కర్నాటకలో 212 సెగ్మెంట్లలో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పారు. దీనిపై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నారాయణ వెల్లడించారు. దీంతో మొన్నటి వరకు బీఆర్ఎస్ తో చెట్టపట్టాలేసుకొని తిరిగిన సీపీఐ.. రూటు మార్చుకుంటుందా..? సీపీఐ కాంగ్రెస్ తో దోస్తీ కడుతుందా..? అనే చర్చ మొదలైంది.

సీపీఐతో కలిసి పనిచేసే విషయంలో సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారని, ప్రత్యామ్నాయాలు వెతకడానికి ముందు ఆయన స్పందన కోసం మరికొన్ని రోజులు వేచి చూస్తామని నారాయణ చెప్పారు.  మునుగోడు  ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ను గెలిపించేందుకు సీపీఐ తన సర్వశక్తులను ఒడ్డింది.  ఆ సమయంలో రెండు బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ బీజేపీని ఓడించేందుకు భవిష్యత్తులో కూడా కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సైలెంట్ అయ్యారు.

కమ్యూనిస్టులతో కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్ ఎలాంటి చొరవ తీసుకోలేదు. దీంతో సీపీఐ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మిత్రపక్షాలను ఎంపిక చేసుకునేందుకు తమకు కొత్త ఆప్షన్లు ఉన్నాయంటూ నారాయణ తన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కు ఓ  కాషన్ ఇచ్చారు.  బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడంపై బీఆర్ఎస్ నుంచి స్పందన రాకపోతే  సీపీఐ కాంగ్రెస్ తో చేతులు కలుపుతుందనే ఊహాగానాలకు ఊతమిచ్చారు. మరో ఐదు నెలల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో సీపీఐ వ్యూహం ఎలా ఉండబోతుందనే విషయంపై నాలుగైదు  రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.