ఇష్టమొచ్చిన డ్రెస్​లతో ఎగ్జామ్​కు వస్తే నో ఎంట్రీ

ఇష్టమొచ్చిన డ్రెస్​లతో ఎగ్జామ్​కు వస్తే నో ఎంట్రీ

బెంగళూరు : రాష్ట్ర స్థాయి నియామక బోర్డులు, కార్పొరేషన్లు చేపట్టే రిక్రూట్​మెంట్​పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు కర్నాటక ఎగ్జామినేషన్ అథారిటీ(కేఈఏ) డ్రెస్ కోడ్ విధించింది. ఎలాంటి డ్రెస్​తో పరీక్ష హాల్​లోకి రావాలనే దానిపై గైడ్​లైన్స్​ఇచ్చింది. తలను పూర్తిగా కప్పేలా టోపీలు లేదా దుస్తులు ధరించిన వారిని ఎగ్జామ్​ సెంటర్​లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. పరీక్షల్లో మోసాలు, కాపీయింగ్​ను నివారించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షలు రాసే అభ్యర్థులు.. తల, ముఖం, చెవులు, నోటిని కప్పేలా ఉండే టోపీలు, ఇతర దుస్తులు ధరించడం నిషేధం. మంగళసూత్రం, కాలికి మెట్టెలు మినహా ఇతర ఏ మెటల్​ఆర్నమెంట్స్​ను అనుమతించబోమని తెలిపింది.

ముఖ్యంగా పురుషులకు సంబంధించి కుర్తా పైజామాలు, జీన్స్​ ప్యాంట్స్​ను అనుమతించబోమని తెలిపింది. హాఫ్​ హ్యాండ్స్​షర్ట్ తో వచ్చే వారికే అనుమతి ఉంటుందని కేఈఏ పేర్కొంది. నవంబరు18, 19 తేదీల్లో రాష్ట్రంలో పలు బోర్డులు, కార్పొరేషన్ల ప్రవేశ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అథారిటీ ఇప్పుడు డ్రెస్ ​కోడ్​ ​ప్రకటించింది. కర్నాటకలో ‘హిజాబ్’ పై ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. తాజా మార్గదర్శకాలలో ‘హిజాబ్’ను నేరుగా ప్రస్తావించనప్పటికీ.. తలను కప్పి ఉంచే దుస్తులపై నిషేధం విధించడంతో.. హిజాబ్​ను కూడా అనుమతించకపోవచ్చని తెలుస్తున్నది.