కర్నాటక పథకాలు.. తెలంగాణలోనూ అమలు చేస్తం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కర్నాటక పథకాలు.. తెలంగాణలోనూ అమలు చేస్తం :  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కర్నాటకలో అమలు అవుతున్న ఐదు కొత్త పథకాలు తెలంగాణలోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌ను ఇంటికి పంపేందుకే కొంగర కొలాన్ మీటింగ్ అని, ఈ నెల 17న జరిగే ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం సిద్దిపేటలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన తర్వాత, ఆయన పార్టీ ఆఫీస్‌‌లో మీడియాతో మాట్లాడారు. 4 కోట్ల మంది ప్రజలు బాగుపడతారని తెలంగాణ ఇస్తే, 4 కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయని సోనియా గాంధీ బాధపడుతున్నారని తెలిపారు. 

కర్నాటక తరహాలో తెలంగాణలోనూ ఐదు పథకాల సోనియా గాంధీ ప్రకటిస్తారని చెప్పారు. ఉచిత కరెంట్ విషయంలో రైతులను మంత్రులు మోసం చేస్తున్నారని, సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో కనీసం 20 గంటల కరెంట్ ఇచ్చినా తన పదవిని వదులుకుంటానని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌‌రావు ఉచిత కరెంట్ ఇస్తున్నామని ఊదరగొట్టడం కాదని, వారి నియోజకవర్గాలలో ఏ ఊరికైనా వెళ్దామని, వాళ్లు చెప్పినట్లు కరెంట్ ఉంటే, తాను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. 

వాళ్లు చెప్పినట్లు కరెంట్ లేకపోతే, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోంగార్డు రవీందర్ మరణం దురదృష్టకరమని, అతనిది ప్రభుత్వ హత్య అన్నారు. ఈటల రాజేందర్‌‌‌‌పై ఉన్న కోపాన్ని మొత్తం ముదిరాజ్‌‌లపై కేసీఆర్‌‌‌‌ చూపిస్తున్నారని, అందుకే ఆ కులానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు.