పిల్లల ఆన్‌లైన్‌ క్లాసుల కోసం.. మంగళసూత్రం తాకట్టు పెట్టి టీవీ కొన్న మహిళ

పిల్లల ఆన్‌లైన్‌ క్లాసుల కోసం.. మంగళసూత్రం తాకట్టు పెట్టి టీవీ కొన్న మహిళ
  • విషయం తెలుసుకుని సాయం చేసిన గ్రామస్థులు
  • పిల్లల భవిష్యత్తు కోసం ఈ పనిచేశాను: మహి

బెంగళూరు: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు అన్ని మూతపడ్డాయి. దీంతో పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే స్టూడెంట్స్‌కు దూర్‌‌దర్శన్‌లో కూడా పాఠాలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మహిళ తన పిల్లల ఆన్‌లైన్‌ క్లాసుల కోసం టీవీ కొనేందుకు డబ్బులు లేక తన మంగళసూత్రం తాకట్టు పెట్టింది. కర్నాటకలోని గదగ్‌ జిల్లా నగ్నూరు గ్రామానికి చెందిన కస్తూరి చల్వాది అనే మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మునియప్ప రోజువారి కూలీకి వెళ్లేవారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు దూర్‌‌దర్శన్‌లో పాఠాలు వినేందుకు ఇంట్లో టీవీ లేకపోవడంతో ఆమె తన 12 గ్రాముల మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో టీవీ కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల పనులు లేక ఆయన దగ్గర డబ్బులు లేకపోవడంతో మంగళసూత్రం తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆ మహిళ చెప్పారు. “ పిల్లలకు దూర్‌‌దర్శన్‌లో పాఠాలు చెప్తున్నారు. మాకు టీవీ లేదు. టీచర్లు పాఠాలను దూర్‌‌దర్శన్‌లో వినాలని చెప్పారు. వాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీవీ కొనేందుకు నిశ్చయించాను. ఎవరూ అప్పు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇక చేసేది లేక మంగళసూత్రం తాకట్టు పెట్టాను” అని కస్తూరి చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తహిసీల్దారు అధికారులను అక్కడికి పంపి ఆమె గురించి వివరాలు సేకరించారు. కాగా.. విషయం తెలుసుకున్న అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమె మంగళసూత్రాన్ని వెనక్కి ఇచ్చేసి తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తిరిగి చెల్లించమని చెప్పి తన మంచి మనసు చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఊర్లోని ప్రజలు ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తమకు తోచిన సాయం చేశారు. ఎమ్మెల్యే ఆమెకు రూ.50వేలు, మంత్రి రూ.20వేలు సాయం చేశారు.