వేములవాడలో ‘కార్తీక’ వేడుకలు ప్రారంభం

వేములవాడలో ‘కార్తీక’ వేడుకలు ప్రారంభం

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. భక్తులు తెల్లవారుజామునే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయం ఎదురుగా ఉన్న రావిచెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం క్యూలైన్‌‌ ద్వారా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా వచ్చే నాలుగు సోమవారాలు ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అద్దాల మండపంలో మహాలింగార్చన, మూడో సోమవారం భీమేశ్వర ఆలయంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. 

కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం, రాత్రి మహాపూజ చేయనున్నారు. మరో వైపు రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో బుధవారం గంటసేపు స్వామివారి దర్శనాన్ని నిలిపివేసి, ఆ తర్వాత యథావిధిగా కొనసాగించారు. భీమేశ్వర ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకొని కోడె మొక్కు చెల్లించారు. రాజరాజేశ్వరస్వామి వారిని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌ సతీమణి అపర్ణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవో రమాదేవి లడ్డూ ప్రసాదం, అమ్మవారి వస్త్రాలు అందజేశారు.