యాదగిరిగుట్టలో అక్టోబర్ 22 నుంచి కార్తీక పూజలు

యాదగిరిగుట్టలో అక్టోబర్ 22 నుంచి కార్తీక పూజలు
  • సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు
  • పరిశీలించిన ఆలయ ఇన్‌చార్జి ఈవో రవినాయక్ 

యాదగిరిగుట్ట, వెలుగు: కార్తీకమాసం పూజలకు యాదగిరిగుట్ట నరసింహుడి క్షేత్రం సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీకమాసం పూజలు కొనసాగనున్నాయి. ఈ మాసంలో యాదగిరి క్షేత్రంలో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో అందుకనుగుణంగా ఆలయ ఆఫీసర్లు వ్రతాల నిర్వహణ బ్యాచ్ ల సంఖ్యను పెంచారు. 

 ప్రస్తుతం రోజుకు నాలుగు విడతల్లో వ్రతాలు నిర్వహిస్తుండగా.. ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి రోజు 6 బ్యాచుల్లో  వ్రతాలు నిర్వహించనున్నట్లు మంగళవారం దేవస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ఇన్‌చార్జి ఈవో రవినాయక్ వ్రత మండపాలను అధికారులతో కలిసి పరిశీలించారు.  వ్రతాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 

కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో వ్రతాలు నిర్వహించనున్నారు.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..  ప్రతి రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం 6 బ్యాచుల్లో వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. పాతగుట్టలో రోజుకు 4  బ్యాచుల్లో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. ప్రతి రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం 4 బ్యాచుల్లో వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు.