
ఆదిలాబాద్ అడవుల నుంచి.. ఖమ్మం గుమ్మం దాకా..! పాలమూరు పల్లెల నుంచి.. మెతుకుసీమ గడపల దాకా..! ఓరుగల్లు కోటల నుంచి.. హైదరాబాద్ గల్లీల దాకా..! ఇందూరు, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి.. ఊరూవాడా.. కలబడి నిలబడితే వచ్చిందీ తెలంగాణ. ఇది పోరాటాల ఖార్ఖానా. ఒక్కరా.. ఇద్దరా.. వందలు వేలమంది చావును ముద్దాడుతూ.. వదిలిన ఊపిరే ఈ తెలంగాణ. ఇది త్యాగాల వీణ!! ‘మా కొలువులు మాగ్గావాలె’ అనే నినాదంతో మొదలైన ఉద్యమం.. ఉవ్వెత్తున ఎగిసింది. స్వరాష్ట్ర కాంక్షను రగిలించింది. ఆరు దశాబ్దాలకుపైగా అలుపెరగని పోరాటాలతో 2014 జూన్ 2న రాష్ట్రం సిద్ధించింది. ఈ పోరు వెనుక ఎన్నో కీలక ఘట్టాలు.. మరెన్నో మైలు రాళ్లు. వాటిని ఒక్కసారి యాదికి తెచ్చుకుందాం...
మలిదశ పోరులో తొలి అమరుడు శ్రీకాంతాచారి
- 2001 ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసిన కేసీఆర్.
- 2009 ఫిబ్రవరి 13: తెలంగాణ ఏర్పాటుపై చర్చించేందుకు అసెంబ్లీ, మండలిలో జాయింట్ కమిటీ ఆఫ్ మెంబర్స్ ఏర్పాటు.
- 2009 సెప్టెంబర్ 2: హెలికాప్టర్ ప్రమాదంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం. రాజకీయ స్తబ్ధత.
- 2009 నవంబర్ 29: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష. దీక్షను భగ్నం చేసిన పోలీసులు. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు కేసీఆర్ తరలింపు.
- 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు: మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది ఇదే టైమ్‌లో. కేసీఆర్ అరెస్ట్‌కు నిరసనగా ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి డిసెంబర్ 3న అమరుడయ్యాడు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి.
- 2009 డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలంటూ కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన.
- 2009 డిసెంబర్ 23: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్రలోనూ ఉద్యమాలు. అక్కడి పలువురు ఎంపీల రాజీనామా. దీంతో ఏకాభిప్రాయం కుదరడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను హోల్డ్‌లో పెట్టింది.