
గజ్వేల్(వర్గల్), వెలుగు: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఇక్రిసాట్ దేశంలోనే మొదటిసారి వ్యవసాయ పరిశోధన సంస్థగా ప్రసిద్ధికెక్కినట్లు సంస్థ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం సమీపంలోని కావేరి వర్సిటీ, విత్తన సంస్థ, రీసెర్చ్ సెంటర్ ను బుధవారం ఆయన సందర్శించారు.
ఇన్నోవేషన్, రీసెర్చ్, స్టూడెంట్ కెపాసిటీ బిల్డింగ్, రూరల్ ట్రాన్స్ ఫర్మేషన్ అంశాలపై వర్సిటీ, ఇక్రిశాట్ ఎంవోయూ కుదుర్చుకోగా.. సంతకాలు చేశారు. అనంతరం సైంటిస్టులు, అధ్యాపకులు, విద్యార్థులతో ఆయన మాట్లాడారు. టెక్నాలజీతో కొత్త వంగడాలను సృష్టించి వ్యవసాయ రంగంలో చరిత్ర సృష్టించాలని సూచించారు. కొత్త పంటల దిగుబడి, ఉత్పాదకతను పెంపొందించి దేశానికి సరిపడా ఆహార సంపదను సృష్టించే లక్ష్యం మన ముందున్నట్లు చెప్పారు. ఇప్పటినుండే లక్ష్యసాధనలో ముందుండాలని సూచించారు. విద్యార్థులు క్షేత్రస్థాయిలో పంట పొలాలు సందర్శించి పరిశోధనలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
కావేరి వర్సిటీ దేశంలోనే తొలి అగ్రిటెక్ వర్సిటీ కాగా, విద్య, పరిశోధనలను నేరుగా వ్యవసాయ క్షేత్రం, రీసెర్చ్ సెంటర్ లోనే కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. తమ సంస్థలో విద్యనభ్యసించిన విద్యార్థులను వ్యవసాయ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతామని చాన్సలర్ భాస్కరరావు, వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, వైస్ చైర్మన్ పవన్ రావు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్టార్ శ్రీనివాసులు, స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్షరావు, అగ్రికల్చర్ డీన్ ప్రతాప్ రెడ్డి, డీన్ ఆఫ్ టెక్నాలజీ కొండా శ్రీనివాస్ పాల్గొన్నారు.