
- కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ దర్యాప్తు షురూ చేయాలని డిమాండ్
నల్గొండ, వెలుగు: కవిత ఎపిసోడ్ పెద్ద డ్రామా అని, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినప్పుడే ఆ పార్టీని ప్రజలు బొంద పెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో గణేశ్ శోభయాత్ర అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. " బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధాన మంత్రే చెప్పారు. అందువల్ల ఇప్పడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రధాన మంత్రి సీబీఐ ఎంక్వైరీని ప్రారంభించాలి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరగడానికి హరీశ్ రావు, సంతోష్ రావులే కారణమని స్వయంగా కవితే చెప్పారు. హరీశ్ రావు కాళేశ్వరం నిధులు దోచుకున్నారు కాబట్టే రెండవ టర్మ్ ఇరిగేషన్ మంత్రిగా తొలగించారని ఆమె వెల్లడించారు. అంతకంటే సాక్ష్యం ఇంకా ఏం కావాలి. కాళేశ్వరం అవినీతి చూసి ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నది.
కేసీఆర్ ఆస్తులపై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించాలి. ఆయన ఆస్తులను వెనక్కి తీసుకోవాలి. ఎస్ఎల్బీసీ పూర్తి చేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నల్గొండ జిల్లాలోని సాగర్ నెల్లికల్ ప్రాజెక్ట్, డిండి ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి.
డిండి ప్రాజెక్ట్ కు రూ.2 వేల కోట్లతో ఇప్పటికే టెండర్లు పిలిచాం. ఏడాదిలో గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తప్పుడు హామీలను ఇవ్వలేదు. లక్ష కోట్లు దోచుకుంటే రూ. 6 వేల కోట్లు మిత్తిలు కడుతూ రూ. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం.
పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. 12 ఏండ్ల నుంచి తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 7 లక్షల రేషన్ కార్డులను ఇచ్చింది" అని మంత్రి పేర్కొన్నారు.