పూల దారి వేసుకుంది

పూల దారి వేసుకుంది

కవితా కపూర్​.. మెహందీ ఫంక్షన్​కి అలియా భట్​ వేసుకున్న పువ్వుల దండలు తయారుచేసింది ఈమే. కాజల్​ అగర్వాల్, కత్రినా కైఫ్​, సోనమ్​ కపూర్​, కరిష్మా తన్నా.. ఇలా టీటౌన్​, బీటౌన్​  బిగ్​ సెలబ్రిటీలందరి పెండ్లిండ్లకి ఫ్లోరల్ జువెలరీ అల్లింది కూడా ఈమెనే. ముఖేష్​ అంబానీ 50వ ​ పుట్టిన రోజుకి ఫ్లోరల్​ డెకర్​ కవితనే. ఇదంతా చూసి తను  ఫ్లోరల్​ ఆర్ట్స్​లో డిగ్రీలు, పీహెచ్​డీలు చేసింది అనుకుంటే పొరపాటు. అయితే బ్యాక్​గ్రౌండ్​ ఉందేమో! అనుకుంటారు చాలామంది. బ్యాక్​గ్రౌండ్​ కూడా పెద్దది కాదు. కుటుంబాన్ని ఆర్థికంగా గట్టెక్కించడానికి ఓ మధ్యతరగతి హౌస్​వైఫ్​ మొదలుపెట్టిన జర్నీ ఇది. అదే ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం అయింది. కవిత ‘ఫ్లోరల్​ ఆర్ట్స్’​ని సెలబ్రిటీల హాట్​ ఫేవరెట్​ చేసింది. ఆమె సక్సెస్​ఫుల్​ జర్నీ ఇది. 


ఇకబెనా..ఇదొక జపనీస్ ఫ్లవర్​ అరేంజ్​మెంట్​ఆర్ట్​. పూలకే అందాన్ని అద్దే ఆర్ట్​ ఇది. రంగురంగుల పూలను అందంగా అమర్చడం. ఎండిపోయిన లేదా బతికున్న చెట్లకు, పూలకు కొత్త కళ తీసుకురావడం ఈ ఆర్ట్​ స్పెషాలిటీ. ఐదువేల వేరియేషన్స్​లో పూలు, మొక్కల్ని అమర్చే ఈ ఆర్ట్​లో కవితా కపూర్​కి మంచి పేరుంది. 
అలాగే ఈమె ‘ఫ్లోరల్​ ఆర్ట్​’ అనే సంస్థకి ఫౌండర్​ కూడా. దీని ద్వారా ఫ్లోరల్​ జువెలరీ,​ వెడ్డింగ్​ యాక్సెసరీస్​ తయారీతో పాటు ఫంక్షన్​లు, పెండ్లిండ్లకి స్పెషల్​ ప్యాకింగ్​, ఫ్లోరల్​ డెకరేషన్స్​ చేస్తుంటుంది. డ్రై ఫ్లోరల్ జువెలరీ... అంటే ఎండిపోయిన పూలను లాకెట్స్​లో పెట్టి అందమైన చైన్లు , బ్రేస్​లెట్స్​ తయారుచేస్తుంటుంది. అసలు హౌస్​వైఫ్​ నుంచి ఎంట్రప్రెనూర్​ వరకు తన జర్నీ అడిగితే ఇలా చెప్పుకొచ్చిందామె.

భర్తకి సాయంగా.. 
కోల్​కతాలో పుట్టి, పెరిగిన కవితకి చిన్నప్పట్నించీ క్రాఫ్టింగ్​ అంటే ఇంట్రెస్ట్​. దానికి కారణం వాళ్ల అమ్మ. తను కూడా క్రాఫ్టింగ్​ చేస్తుండేది. అలా తల్లిని చూస్తూ అందులో​ని టెక్నిక్స్​ అన్నీ నేర్చుకుంది కవిత. కానీ, ఆ ప్యాషన్​ని ప్రొఫెషన్​గా మార్చింది మాత్రం అత్తింటి ఆర్థిక పరిస్థితులు. పెండ్లి తర్వాత భర్తతో కలిసి ముంబై షిఫ్ట్​ అయింది కవిత. ఇంటి, వంట పనులు, కుటుంబ బాధ్యతల్లో పడి క్రాఫ్టింగ్​ ఆలోచన్నే మర్చిపోయింది. కొంతకాలం అంతా బాగానే ఉన్నప్పటికీ తర్వాత తర్వాత ఆమె భర్త బిజినెస్​ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లింది. దాంతో చేసేదేంలేక ఆ బిజినెస్​ని మూసేశాడు భర్త. ఆ పరిస్థితుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించడానికి ఫ్యామిలీ బిజినెస్​ ఏదైనా  పెట్టాలనుకుంది కవిత. చిన్నప్పట్నించీ క్రాఫ్టింగ్​తో పాటు గార్డెనింగ్​ కూడా ఇష్టం కావడంతో అటు వైపు మళ్లింది ఆమె ఆలోచన. భర్తతో కలిసి నర్సరీ పెట్టింది. 

అదే టైంలో ఇకబెనా ఆర్ట్​ కూడా నేర్చుకుంది. ఫ్లోరల్​ జువెలరీ తయారీ మొదలుపెట్టింది. కానీ, పాతికేండ్ల కిందట వాటికంత ఆదరణ లేకపోవడంతో తక్కువ ఆర్డర్స్​ వచ్చేవి. మొదట్లో వాటిని ఆమె భర్తే డెలివరీ చేసేవాడు. అలా ఆర్డర్​ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన ప్రతిసారీ ‘ వీటిని మా ఆవిడ తయారుచేసింది. మీలో ఎవరికైనా కావాలంటే..ఈ నెంబర్​కి ఫోన్​ చేయండ’ని  చెప్పేవాడు. దాంతో ఆ నోట ఈ నోట ఆమె ప్రొడక్ట్స్​ గురించి తెలిసి కస్టమర్స్​ పెరిగారు. అలా 2002 లో ‘ఫ్లోరల్​ ఆర్ట్​’ ని లాంచ్​​ చేసింది కవిత. దాన్ని నిలబెట్టడానికి ఆమె కూతురు సృష్టి కూడా సాయం చేసింది.  ఫ్లోరల్​ ఆర్ట్​కి సంబంధించిన మార్కెటింగ్,  కమ్యూనికేషన్స్, బ్రాండింగ్​,  సోషల్ మీడియా అంతా ఆ అమ్మాయే చూసుకుంది. ఇప్పటికీ వాటి మీద తనే వర్క్​ చేస్తోంది.

సెలబ్రిటీలకి కేరాఫ్​
మొదట్నించీ డబ్బు ఖర్చుచేసి ఎలాంటి మార్కెటింగ్​ ప్రోగ్రామ్స్​ చేయలేదు కవిత.. కానీ, ఆమె చేతి కళలోని అందం కస్టమర్స్ సంఖ్యని రోజురోజుకి పెంచింది. అలా సాగుతున్న ఆమె ఎంట్రప్రెనూర్​ జర్నీకి బిగ్​ బ్రేక్​ ఇచ్చింది పదేండ్ల కిందట జరిగిన ముఖేష్​ అంబానీ 50 వ పుట్టినరోజు. ఆ ఈవెంట్​కి ఫ్లోరల్​ డెకరేషన్​ చేసింది కవిత. అప్పట్నించీ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత సోనమ్​ కపూర్​ మెహందీ ఫంక్షన్​ కోసం ఫ్రెష్​ ఫ్లవర్స్​తో ‘కలీరా’ తయారు చేసింది. నేహా దూపియా శ్రీమంతం ఫంక్షన్​కి పూలతో అందమైన కిరీటాన్ని అల్లింది. కాజల్​ అగర్వాల్​ పెండ్లికి కూడా రంగు రంగుల ఫ్రెష్ ఫ్లవర్స్​తో జువెలరీ తయారు చేసింది. రీసెంట్​గా అలియా మెహందీ ఫంక్షన్​కి వేసుకున్న ఫ్లోరల్​ దండలు కూడా కవిత తయారుచేసినవే. ఆ సెలబ్రిటీ లంతా వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో పెట్టడంతో కస్టమర్స్​ మరింత పెరిగారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్​ మార్కెట్​ 
మీద​ కూతురితో కలిసి వర్క్​ చేస్తోంది కవిత.