
- బనకచర్లను సీఎం రేవంత్ అడ్డుకోవాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ సీఎం జగన్ గతంలోనే పోలవరం నుంచి గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రతిపాదనను తీసుకొస్తే కేసీఆర్ వ్యతిరేకించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నల్లమల పులిని అని చెప్పుకునే సీఎం రేవంత్ ఏపీ జలదోపిడీని అడ్డుకునే విషయంలో పేపర్ టైగర్ గానే మిగిలిపోయారని ఆరోపించారు. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు కడుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఆ ప్రాజెక్టును వెంటనే అడ్డుకోవాలని కోరారు.
బుధవారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గోదావరి జలాలపై ఏపీ మంత్రి నిమ్మల రామా నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వృథాగా పోతున్న గోదావరి జలాలను మన పొలాలకు మళ్లించాలని కేసీఆర్ ఆలోచించారని తెలిపారు. తుపాకులగూడెం వద్ద నుంచి గోదావరి, కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని కేసీఆర్ వాదించారని చెప్పారు.