నన్ను మీరే కాపాడాలి.. ప్రియురాలిపై భారత క్రికెటర్ పోలీసులకు ఫిర్యాదు

నన్ను మీరే కాపాడాలి.. ప్రియురాలిపై భారత క్రికెటర్ పోలీసులకు ఫిర్యాదు

భారత యువ క్రికెటర్, మాజీ కేకేఆర్, పంజాబ్ కింగ్స్ ఆటగాడు కేసీ కరియప్ప తన ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రికెట్ కెరీర్‌ ముగించేస్తానని తన ప్రియురాలు బెదిరిస్తోందని.. తన తండ్రి, తల్లి మరియు అన్నయ్య సహా కుటుంబసభ్యుల అందరినీ హంతమొందిస్తానని హెచ్చరించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

ఏంటి వీరి గొడవ..?

కర్ణాటక దేశవాళీ క్రికెటర్ అయిన కేసీ కరియప్ప, దివ్య అనే యువతి ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి బంధంలో విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్ల అనంతరం డిసెంబర్ 31, 2022న సదరు యువతి కరియప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనను లోబరుచుకుని గర్భవతిని చేసి.. తనకు అబార్షన్‌ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అందుకు తగ్గ సాక్ష్యాలను ఆమె పోలీసులకు అందించకపోవడంతో ఆ కేసు అలా మిన్నకుండిపోయింది. 

ఇది జరిగి దాదాపు ఏడాది అనంతరం ఇప్పుడు కరియప్ప తన ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. "నాగసంద్రలోని రామయ్య లేఅవుట్‌లో నివాసం ఉంటున్న కేసీ కరియప్ప అనే తనకు దివ్య(24) అనే యువతితో స్నేహం ఉండేదని, అయితే ఆమె చెడు అలవాట్ల కారణంగా తనతో బంధాన్ని తెంచుకున్నానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె డ్రగ్స్‌, మద్యానికి బానిసని ఆరోపించాడు. తనను ఆ అలవాట్లను మానివేయమని ఒప్పించేందుకు ప్రయత్నించానని, తన మాట వినకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అప్పటినుంచి తనకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. 

ఆ బంధాన్ని పావుగా వాడుకొని తమ ప్రియురాలు తనను వేధిస్తోందని కరియప్ప పోలీసుల ఉందు వాపోయాడు. తన క్రికెట్ కెరీర్‌ను అంతం చేస్తానని బెదిరిస్తోందని, తన నుంచి మీరే కాపాడాలంటూ పోలీసులను వేడుకున్నాడు. 

ఎవరీ కరియప్ప..?

కొంగండ చరమన్న కరియప్ప అలియాస్ కేసీ కరియప్ప స్వస్థలం కర్ణాటకలోని కూర్గ్‌. ఇతడు లెగ్‌స్పిన్నర్. లెగ్ బ్రేక్, స్టాక్ బాల్, గూగ్లీ మరియు క్యారమ్ బాల్ వంటి అన్ని రకాల బంతులు వేయగలడు. దేశవాళీ క్రికెట్‌లో మంచిగా రాణించినవాడే. చెప్పుకోదగ్గ ప్లేయరే. మిస్టరీ బౌలర్‌గా పేరొందిన కరియప్ప ఐపీఎల్‌‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2015 సీజన్‌లో కేకేఆర్ అతని కోసం ఏకంగా 2.4 కోట్లు వెచ్చించటం గమనార్హం. తాజాగా ముగిసిన ఐపీఎల్‌ మినీ వేలంలో కరియప్ప అన్‌సోల్డ్‌ ఆటగాడగా మిగిలిపోయాడు.