ఉద్యమంలో వేరేటోళ్లే లేరన్నట్టుగా కేసీఆర్​ గొప్పలు

ఉద్యమంలో వేరేటోళ్లే లేరన్నట్టుగా కేసీఆర్​ గొప్పలు
  • తొలిదశ నుంచి మలిదశ ఉద్యమం దాకా పోరాడినోళ్లు ఎందరో
  • చావును ముద్దాడి తెలంగాణకు ఊపిరులూదిన అమరులు ఇంకెందరో
  • అందరినీ తప్పించి తానే రాష్ట్రాన్ని తెచ్చినట్లుగా గులాబీ బాస్​ ప్రచారం
  • తన పాలనకు ముందు తెలంగాణలో చరిత్రే లేనట్టు కలరింగ్​

హైదరాబాద్, వెలుగు: ఏ ఒక్కరో.. ఇద్దరో కాదు.. సబ్బండవర్గాలు, సకల జనులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు. తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ఎందరో బరిగీసి జంగ్​ సైరన్​ ఊదారు. రివ్వున ఎగిసే నిప్పు కణికలను ముద్దాడారు.. పోలీసు బందూకులకు గుండెలను అడ్డుపెట్టారు.. వందలు వేల మంది అమరులయ్యారు. ఎందరో కళాకారులు గజ్జెకట్టి ఊరూరా తెలంగానమాలపించారు. మేధావులు, స్టూడెంట్లు, కార్మికులు, కర్షకులు, జర్నలిస్టులు.. ‘జై తెలంగాణ’ అంటూ పిడికిలెత్తి గర్జించారు. కానీ, వాళ్లందరి చరిత్ర తర్వాతి తరాలకు తెలియకుండా మరుగున పడేసే కుట్రకు సీఎం కేసీఆర్​ తెరలేపారు. ‘‘తెలంగాణకు ముందూ నేనే.. వెనుకా నేనే.. భవిష్యత్తూ నేనే.. నేనే తెలంగాణ.. తెలంగాణే నేను’’ అన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు తాను లేకుంటే తెలంగాణ పోరాటమే లేదన్నట్టు.. తమ పాలనకు ముందు తెలంగాణోళ్లు అన్నమే తినలేదన్నట్లు, నీళ్లే తాగలేదనట్లు, చారిత్రక సాక్ష్యాలే లేవన్నట్టు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 

తెలంగాణకు అంతా నేనే!


సూర్యాపేట డిక్లరేషన్​, వరంగల్​ డిక్లరేషన్​, తెలంగాణ మహా సభ, తెలంగాణ జన సభ, తెలంగాణ జన పరిషత్​ ఇట్ల లెక్కకు అందని సంఘాలు,చరిత్రకెక్కని మీటింగులు ఎన్నో ఉన్నాయి. ‘‘నేనే కొట్లాడిన.. నేనే తెలంగాణ తెచ్చినా’’ అని చెప్పుకునేటోళ్లకు తెలంగాణ సోయి లేన్నాడే తెలంగాణ కోసం కొట్లాడినోళ్లు, రాసినోళ్లు, ఆడినోళ్లు, పాడినోళ్లు, అమరులైనోళ్లు ఎందరో ఉన్నారు. నాడు వాళ్లంతా తెలంగాణ కోసం పోరాడుతుంటే.. తెలంగాణ ఆట, పాటను బంద్​పెట్టిన ఎన్టీఆర్​ హయాంలో ఎమ్మెల్యే.. కేసీఆర్. తెలంగాణ మీటింగులకు పర్మిషన్లు ఇవ్వకుండా, తెలంగాణ ఉద్యమకారుల మీద కేసు పెడ్తున్న టైమ్​లో చంద్రబాబు దగ్గర మంత్రి.. కేసీఆర్​. ఇంకోసారి మంత్రి పదవి దక్కలేదనే కోపంతోనే టీడీపీలో నుంచి బయటకొచ్చి టీఆర్​ఎస్​ పార్టీ పేరిట తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్​ ఎత్తుకున్నారని ఆ వ్యవహారం గురించి తెలిసిన చాలా మంది చెప్తుంటారు. టీఆర్​ఎస్​ పార్టీని పెట్టి కేసీఆర్​ ఢిల్లీలో.. ఆ పార్టీ వాళ్లు ఉమ్మడి ఏపీలో మంత్రులయ్యారు. మళ్లీ ఇంకోసారి టీడీపీతో పొత్తు పెత్తుకుని ఎన్నికలకు పోతే ఓడిపోయారు. వైఎస్​రాజశేఖరరెడ్డి చనిపోయాక తెలంగాణ కోసం కేసీఆర్​ దీక్షలో కూర్చుంటే పోలీసులు అరెస్ట్​ చేసి ఖమ్మం దవాఖానలో చేర్పించారు. దీంతో కొట్లాడింది సాలని పండ్ల రసం తాగి ఆయన దీక్షను విరమిస్తే.. ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు మండిపడ్డారు. దీంతో కేసీఆర్  మళ్లీ దీక్ష పట్టారు. నిమ్స్​లో చేరాక తెలంగాణ ప్రకటనొస్తే.. ఒక్కటే దీక్షను రెండోసారి విరమించిన చరిత్ర కేసీఆర్​ది. దానికే సావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకుంటున్నారు. మరి.. అగ్గిని ముద్దాడిన శ్రీకాంతాచారి, ఒంటికి మంట అంటించుకున్న సిరిపురం యాదయ్య, కాలిబూడిదైన వేణుగోపాల్​ రెడ్డి, తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్​ కిష్టయ్య, పార్లమెంట్​ దగ్గర ప్రాణం వదిలిన యాదిరెడ్డి, మైసమ్మకు బలిచ్చుకున్న ఇషాన్​ రెడ్డి, రాష్ట్రం రాదేమోనని రందివడి ఉసురు తీసుకున్న స్వర్ణమ్మ.. ఒక్కరా.. ఇద్దరా 1,200 మందికిపైగా  అమరుల త్యాగాలను ఏమనాలి? 

అసలు తెలంగాణకు చరిత్రే లేనట్టు..!

కేసీఆర్​ పార్టీ పెట్టక ముందు.. ఆయన ముఖ్యమంత్రి గాక ముందు తెలంగాణకు చరిత్రే లేనట్టు, తెలంగాణ గురించి ఎవ్వరూ మాట్లాడనట్టు, తెలంగాణ కోసం ఎవ్వరూ కొట్లాడనట్టు, అసలు తెలంగాణ అనే పదమే లేదన్నట్టు ప్రకటనలు చేస్తున్నారు. ఔను.. సారు చెప్పిందే తెలంగాణ చరిత్ర అని, చాటింపు వేయడానికి.. నాడు తెలంగాణ ఉద్యమం మీద విషం కక్కిన టీవీలు, పేపర్లు రెడీగా ఉన్నాయి. కోట్లాది రూపాయల అడ్వర్టయిజ్​మెంట్లు ఇస్తుంటే వాళ్లదేం పోయింది.. ఎట్లంటే అట్ల రాస్తరు. అదంతా జనం సొమ్ము.  ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్ల ఉండనియ్యరన్నట్టు.. జరిగింది జరిగినట్టు రాస్తే తెలంగాణోళ్లు సూడొద్దని వెలుగును అరచేతితోటి ఆప్తం, V6ను వెలివేస్తం అని ధమ్కీలిస్తున్నరు. అంటే సారొక్కడే మిలియన్​ మార్చ్​ చేశారు.. సారొక్కడే సాగరహారానికొచ్చారు.. సారొక్కడే సకల జనుల సమ్మె చేశారు.. సారొక్కడే వంటావార్పు చేశారు..  సారొక్కడే ధర్నాచౌక్​లో కూర్చున్నారు.. సారొక్కడే రైల్ రోకో చేశారు.. సారొక్కడే చలో అసెంబ్లీకి ఉరికొచ్చారు.. సారొక్కడే ఓయూలో మర్లవడ్డారు.. సారొక్కడే కాకతీయ వర్సిటీలో కొట్లాడారు.. సారొక్కడే పాటలు రాశారు.. సారొక్కడే స్పీచులిచ్చారు.. సారొక్కడే పార్లమెంట్​లో  ఫైటింగ్​ చేశారు.. సారొక్కడే తెలంగాణ తెచ్చారు. మూడున్నర కోట్ల మంది కొట్లాడలే, జేఏసీ పుట్టలే, అమరులు కాలేదు, పార్లమెంట్​లో కాంగ్రెస్​ బిల్లు పెట్టలేదు, బీజేపీ మద్దతు ఇవ్వలేదు. మొత్తం ఒక్కడే చేసిండు..!!.. అట్లున్నది సర్కారు వారి పబ్లిసిటీ. 

ఒక్కరా.. ఇద్దరా..!

‘‘తలాపున పారుతుంది గోదారి.. నీ చేను, నీ చెలకా ఎడారి..’’ అని బడి పంతులు సదాశివుడు ఉద్యమ పాటలు రాశారు. నీళ్లల్ల దోపిడీని నిక్కచ్చిగ ప్రశ్నించింది విద్యాసాగర్​రావు. ‘‘మా భూములు మాకేనని’’ పాట పాడి కడుపుల తూటా మోస్తున్నరు మన గద్దర్​. ప్రొఫెసర్లు బియ్యాల జనార్ధన్​ రావు, కొమురన్న, హక్కుల కోసం తండ్లాడిన బుర్ర రాములు, తొలి మలి ఉద్యమాలల్లో కొట్లాడిన ఆకుల భూమయ్య, తెలంగాణ కళా సమితి ఐలన్న, ఒక్కలా ఇద్దరా తొవ్వ పొడుగునా వీరులే.

ఎందరో వీరులు..

మారోజు వీరన్న: ఉద్యమంలో మండే ఇంజన్​ లాంటోడు మారోజు వీరన్న. తెలంగాణ మహాసభ పేరుతో సూర్యాపేట డిక్లరేషన్​ ఇచ్చిన ఆ బహుజన ఉద్యమ వీరుడిని.. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఎన్​కౌంటర్​ పేరిట కాల్చి చంపేశారు. 

కేశవరావు జాదవ్​: ముల్కీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో పోరాడారు ప్రొఫెసర్​ కేశవరావు జాదవ్​ సార్​. సొంత రాష్టంలోనే ఆయన కాలం జేస్తే.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలనూ సర్కారు చేయించలేదు.

కొండా లక్ష్మణ్​ బాపూజీ: 1969లో తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేయడానికి అప్పటి ఉమ్మడి పాలకులు 369 మందిని కాల్చి చంపేశారు. దీనిపై మండిపడిన అప్పటి మంత్రి కొండా లక్ష్మణ్​ బాపూజీ.. తన పదవిని గడ్డి పోచలెక్క విసిరిపారేశారు. అప్పట్నుంచి ప్రాణం విడిచేదాకా తెలంగాణ మాట మరువలేదాయన. తెలంగాణ జెండానూ దించలేదు. రాష్ట్రం వచ్చే కొన్ని రోజుల ముందు కాలం చేశారు. 

కాకా వెంకటస్వామి: 1969 ఉద్యమంలో బుల్లెట్​ తాకినా.. గడ్డం వెంకటస్వామి తెలంగాణ కోసం కలెవడి నిలవడి కొట్లాడారు. కాంగ్రెస్​ హైకమాండ్​ మీటింగ్ పెట్టినప్పుడల్లా.. తెలంగాణ ఇయ్యాల్సిందేనని పట్టుపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూశాకనే ప్రాణం విడుస్తానని చెప్పిన ఆయన.. అన్నట్టుగానే సొంత రాష్ట్రంలోనే కన్నుమూశారు.

మర్రి చెన్నారెడ్డి: తెలంగాణ కోసం ఓ పార్టీ ఉండాలన్న ఉద్దేశంతో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి పార్టీని పెట్టారు. పది మంది ఎంపీలను పార్లమెంటుకు పంపించారు. 

కాళోజీ: కర్ణాటకలో పుట్టి, వరంగల్​కు బతుకుదెరువు కోసం వచ్చిన కాళోజీ.. తెలంగాణ కొట్లాటకు తొవ్వ జూపించారు. ‘మా తెలంగాణ’ అని మాట్లాడలేని కాలంలో పెన్ను, పేపరు పట్టి 3 కోట్ల మందికి గొంతుకయ్యారు. ‘‘దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరందాకా తన్ని తరమాలే.. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోటే పాతిపెట్టాలె’’ అంటూ నినదించిన పెద్దమనిషి ఆయన. ఎందరో ఉద్యమకారులకు గురువయ్యారు. 

గూడ అంజన్న: ‘అయ్యోనివా.. నువ్వు అవ్వోనివా’ అంటూ సమైక్య పాలకులపై గళం విప్పినా.. ‘ఊరు మనదిరా.. వాడ మనదిరా’ అంటూ ఉద్యమ ఊపును తెచ్చినా.. ‘పుడితొక్కటి.. సత్తె రెండు రాజిగ వొరి రాజిగ’ అంటూ ఉద్యమంలో గొంతెత్తినా గూడ అంజన్నకే చెల్లింది. అట్లాంటి కవి, కళాకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాలం చేసినా.. నివాళి అర్పించేందుకూ కనీసం టైం దొరకలేదు మన పాలకులకు. 

జయశంకర్​ సార్​: 60 ఏండ్ల పోరాటంలో మూడు తరాలతోనూ నడిచిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్​ జయశంకర్​ సార్​. ఆయన ఎజెండా పార్టీలు, జెండాలు కాదు.. తెలంగాణే ఆయన ఏకైక ఎజెండా. ఎవరు ‘జై తెలంగాణ’ అన్నా వాళ్లందరికీ  మద్దతిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో మీటింగులు పెట్టారు. ఎన్నో సంఘాలను కలిశారు. ఎందరినో ఉద్యమంలోకి తీసుకొచ్చారు. పెండ్లి కూడా చేసుకోకుండా ఉద్యమానికే జీవితాన్ని త్యాగం చేసి.. బతికినన్ని రోజులు రాష్ట్రం కోసమే తండ్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు మూడేండ్ల ముందు తుదిశ్వాస విడిచారు. ఆయన ఉద్యమ చరిత్ర ఎంత చెప్పుకున్నా ఒడువని ముచ్చట్నే. 

జయశంకర్​ సార్​: 60 ఏండ్ల పోరాటంలో మూడు తరాలతోనూ నడిచిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్​ జయశంకర్​ సార్​. ఆయన ఎజెండా పార్టీలు, జెండాలు కాదు.. తెలంగాణే ఆయన ఏకైక ఎజెండా. ఎవరు ‘జై తెలంగాణ’ అన్నా వాళ్లందరికీ  మద్దతిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో మీటింగులు పెట్టారు. ఎన్నో సంఘాలను కలిశారు. ఎందరినో ఉద్యమంలోకి తీసుకొచ్చారు. పెండ్లి కూడా చేసుకోకుండా ఉద్యమానికే జీవితాన్ని త్యాగం చేసి.. బతికినన్ని రోజులు రాష్ట్రం కోసమే తండ్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు మూడేండ్ల ముందు తుదిశ్వాస విడిచారు. ఆయన ఉద్యమ చరిత్ర ఎంత చెప్పుకున్నా ఒడువని ముచ్చట్నే. 

అన్నమే తిననట్టు..! 

తమ పాలన రాక ముందు తెలంగాణోళ్లు అన్నమే తిననట్టు, మిషన్ భగీరథకు ముందు నీళ్లే తాగనట్టు, అప్పట్ల కరెంటే చూడనట్టు, రైతుబంధుకు ముందు వ్యవసాయమే చెయ్యనట్టు, కల్యాణ లక్ష్మికి ముందు ఆడిపిల్లల పెండ్లిళ్లే కానట్టు, ధరణి కంటే ముందు భూములకు పట్టాలే లేనట్టు కేసీఆర్​ ప్రచారం  చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ బండ గుర్తులంటే ‘‘నేను కట్టిన సచివాలయం, నేను కట్టిన కాళేశ్వరం, నేను కట్టిన యాదాద్రి, నేను కట్టిన అమరుల స్తూపం, నేను కట్టిన పోలీస్ టవర్, నేను కట్టిన అది, నేను కట్టిన ఇది’’ అని ఆయన​ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ, తెలంగాణ అంటే 400 ఏండ్ల కిందట కట్టిన చార్మినార్​, పాలనకు పేరొందిన కాకతీయ తోరణం, అందాల అసెంబ్లీ బంగ్లా, తాత ముత్తాతలు కొలిచిన యాదగిరిగుట్ట, ఎన్కట కట్టిన నాగార్జునసాగర్​ వంటివి ఎన్నో ఉన్నాయి. 

అందెశ్రీ పాట రాష్ట్ర గీతం ఎందుకు కాలే?

తానే కట్టిచ్చిన అని కేసీఆర్​ కొత్త అమరుల స్తూపం చూపిస్తున్నారుగానీ.. టీఆర్​ఎస్​ పార్టీ పెట్టడానికి 25 ఏండ్లకు ముందే కట్టిన గన్​పార్క్​ అమరుల స్తూపం తెలంగాణ త్యాగాలకు గుర్తు. ఉద్యమంలో TG (టీజీ) అని గర్వంగా రాస్కుంటే..TS (టీఎస్​) అని ఎందుకు మారింది? అందెశ్రీ రాస్తే మూడున్నర కోట్లమంది పాడిన ‘జయ జయహే తెలంగాణ’ పాట.. రాష్ట్ర గీతం ఎందుకు కాలేదు? దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న తెలంగాణకు ఇప్పటికీ రాష్ట్ర గీతం కూడా ఎందుకు లేదు?!