
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి వల్ల పాలమూరు, నల్లగొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని విమర్శించారు.
'ఏపీ కుట్రపూరితంగా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతలకు జగన్ తలపెట్టారు. ఏపీ చర్యలను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోకపోవట్లేదు. ఇక తెలంగాణ ఎడారిగా మారడం ఖాయం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలి. కానీ రాయలసీమ ఎత్తిపోతల అక్రమ ప్రాజెక్టు ను నిలుపుదల చేసేలా తెలంగాణ అడ్డుకోలేకపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో రెండు టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించు కోవడంలోనూ రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయ్యింది. అలాంటిది మూడో టీఎంసీ లిఫ్ట్ చేయడంలో మతలబేంటి? కమీషన్లకు కక్కుర్తిపడి మూడో టీఎంసీ చేపడుతున్నారు. ఎస్ఎల్ బీసీకి ఏడేళ్లు అవుతున్న పూర్తి చేయడం లేదు. కృష్ణా జలాలు అక్రమంగా తరలిస్తుంటే స్పందించడం చేతకాని వ్యక్తి .. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదు' అని మండిపడ్డారు.