
- టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి
- 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ
- 2014, 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ బరిలో కవిత
- 2024 లిస్ట్‌లో కనిపించని ఇద్దరి పేర్లు
హైదరాబాద్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల బరి నుంచి బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫ్యామిలీ తప్పుకున్నది. 23 ఏండ్ల ఆ పార్టీ చరిత్రలో ఇట్ల ఒక కీలక ఎలక్షన్ నుంచి కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా తప్పుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఎక్కువ మంది కొత్తవాళ్లే. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల వరకూ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. కానీ, ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. 2001లో టీఆర్‌ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు.
ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ పోటీ చేశారు. రెండు స్థానాల్లో గెలుపొందడంతో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఎంపీగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్‌లో మంత్రిగా చేరారు. సిద్దిపేట బైఎలక్షన్లో హరీశ్‌రావు పోటీ చేసి, విజయం సాధించారు.
ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ తన ఎంపీ పదవికి రెండుసార్లు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో వచ్చిన 2006, 2008 బై ఎలక్షన్లలో రెండుసార్లు భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. 2009 ఎలక్షన్లలో కేసీఆర్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడి గెలుపొందారు. ఆయన మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే ఉద్యమం ఊపందుకున్నది.
కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 2014లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా, మెదక్‌నుంచి ఎంపీగా పోటీచేశారు. ఈ రెండు చోట్లా ఆయన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక సీట్లు గెలువడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కేసీఆర్ సీఎం అయ్యారు. ఎంపీ స్థానానికి రాజీనామా చేసి, మెదక్ ఎంపీ సీటును కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వగా.. ఆయన గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్, హరీశ్‌రావు సిరిసిల్ల, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రులయ్యారు.
పోయినసారి కవిత పోటీ చేసినా..
లోక్‌సభలో కేసీఆర్ తన వారసత్వాన్ని బిడ్డ కవితకు అప్పగించారు. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆమెను కేసీఆర్ బరిలోకి దింపారు. కవిత భారీ విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లి.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసిన కవిత, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మీద ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
వెంటాడిన ఓటమి భయం!
వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారి పోటీ చేసిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. 80కిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి పడిపోయింది. ఓటమి ఆ పార్టీని తీవ్రంగా దెబ్బకొట్టింది. కీలక నాయకులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. దీంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. నిజామాబాద్‌లో పోటీకి పెద్దగా ఆసక్తి చూపని కవిత.. పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్న మెదక్ నుంచి పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు భావించాయి.
కానీ, ఇంతలోనే ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో మెదక్ సీటు నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ సీటు కన్ఫామ్ చేశారు. సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి గత టర్మ్ వరకూ అన్ని ఎన్నికల్లోనూ లోక్‌సభకు పోటీపడిన కేసీఆర్ ఫ్యామిలీ.. ఈసారి దూరంగా ఉండిపోయింది. ఓటమి భయంతోనే ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీకి నిలబడలేదని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.