ఈ సర్కారు ఏడాదైనా ఉంటదో?.. ఉండదో?: కేసీఆర్​

ఈ సర్కారు ఏడాదైనా ఉంటదో?.. ఉండదో?: కేసీఆర్​
  • ప్రజలు అప్పుడప్పుడు లిల్లీపుట్​ గాళ్లకు అధికారమిస్తరు
  • అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్స్​లో చెయ్యొద్దు
  • 127 అడుగుల అంబేద్కర్​ విగ్రహం పెడితే కనీసం దండెయ్యరా?
  • మరి నేను కట్టిన సెక్రటేరియెట్​లో ఎట్లా కూసుంటరు?
  • కాంగ్రెస్​ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తం
  • బీఆర్ఎస్​ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసుల అంతుచూస్తం
  • రు.2 లక్షల రుణమాఫీ ఓ బోగస్ 
  • కాంగ్రెస్​ హామీలపై రాష్ట్రవ్యాప్త పోస్టుకార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన
  • సంగారెడ్డి జిల్లా సుల్తాన్​పూర్​లో​ బీఆర్ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ

సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో ఈ కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాదైనా ఉంటదో? ఉండదో తెల్వదని బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ అన్నారు. పార్లమెంట్​ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు సీట్లు కూడా రావని సర్వే రిపోర్టులు చెబుతున్నాయని తెలిపారు.  ఈ ఎన్నికల తర్వాత  ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తడో.. సీఎం జంప్​ కొడతడో.. ఎప్పుడు ఏమైతదో తెల్వని పరిస్థితి ఉన్నదని చెప్పారు. ప్రజలు అప్పుడప్పుడూ లిల్లీపుట్​గాళ్లకు అధికారం ఇస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు మళ్లీ  పార్లమెంట్​ ఎలక్షన్స్​లో చేయొద్దని ప్రజలకు సూచించారు.​  సంగారెడ్డి జిల్లా ఆందోల్​ నియోజక వర్గం సుల్తాన్​పూర్​లో బీఆర్ఎస్​ప్రజా ఆశీర్వాద సభ కు కేసీఆర్​ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను కాంగ్రెస్​ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 9న రుణమాఫీ అన్నరు.. ఇప్పుడు పార్లమెంట్​ఎన్నికలు రాగానే ఆగస్టు 15 అంటూ కాంగ్రెస్​ బోగస్​ హామీలు ఇస్తున్నది.. ఇది పార్లమెంట్​ ఎన్నికల స్టంట్​మాత్రమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సురుకు పెడితేనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయి’ అని చెప్పారు.  

‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఇచ్చిన మోసపూరిత హామీలను తెలంగాణ ప్రజలు నమ్మడం వల్లే బీఆర్ఎస్ దెబ్బతిన్నది.. ఇప్పుడు కాంగ్రెస్​కు అధికారం ఎందుకిచ్చామా? అని ప్రజలు బాధపడ్తున్నరు. అందుకే ఈ పార్లమెంట్​ఎన్నికల్లో అలాంటి తప్పు చెయ్యొద్దు’ అని ప్రజలకు కేసీఆర్ సూచించారు. రాజకీయంగా లిల్లీపుట్​​గాళ్లకు బలం వచ్చిందని, ప్రజలకు సేవ చేయడం మరిచి అడ్డం పొడువు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇచ్చిన వాగ్దానాలు మరిచినందున 5 నెలల్లోనే ఘోరంగా ఓడిపోబోతున్నారని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ చేతకానితనం వల్లే వేసవిలో తాగు, సాగు నీటి కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్​తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. పదేండ్లలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి అనేక బెనిఫిట్స్ కల్పించామని, ఈ పార్లమెంట్​ ఎన్నికల్లో ఆలోచించి బీఆర్ఎస్​ అభ్యర్థులకు ఓటేయాలని ఉద్యోగులను కేసీఆర్​అభ్యర్థించారు. 

కాంగ్రెస్​ వాగ్దానాలపై పోస్టు కార్డు ఉద్యమం

కాంగ్రెస్​ ఇచ్చిన  వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్​ చేస్తూ పోస్టుకార్డు ఉద్యమం చేపట్టాలని   ప్రజలకు, రైతులకు కేసీఆర్​ సూచించారు. సిద్దిపేటలో మొదలైన ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్​ కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వంపై తమకు ఎలాంటి అసూయ, ఓర్వలేనితనం  లేవని, కానీ తెలంగాణ ప్రజల యోగ క్షేమాలే తమకు ముఖ్యమన్నారు. అందుకే ఈ ప్రభుత్వంపై దండయాత్ర చేసి, ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ​‘దేశంలోనే అత్యంత ఎత్తయిన 127 అడుగుల అంబేద్కర్​విగ్రహాన్ని హైదరాబాద్​లో ఏర్పాటు చేసినం. విగ్రహం పెట్టినంక వచ్చిన తొలి జయంతి నాడు అక్కడికి ఈ లిల్లీపుట్​గాళ్ల గవర్నమెంట్​పోలె. ఆ హిమాలయ పర్వతమంత ఎత్తున్న ఆ మహానీయుడికి ఒక్క పువ్వు పెట్టలే.  అక్కడ తాళాలు వేయడమే కాకుండా కనీసం నివాళులు అర్పించలేక పోయారు’ అని అన్నారు. మరి తాను కట్టిన సచివాలయానికి అంబేద్కర్​ పేరే పెట్టామని, అందులో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు మిడిమిడి జ్ఞానంతో బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక వారి అంతుచూస్తామని హెచ్చరించారు.

బీజేపీ అక్కరకురాని సుట్టం

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అక్కరకు రాని సుట్టంగా మారిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. గడిచిన పదేండ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని, అలాంటి పార్టీకి ఓటేస్తే మంజీరా నదిలో వేసినట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ బీజేపీకి  బీ టీమ్​గా మారి బీఆర్ఎస్​పై బురద జల్లే పని పెట్టుకుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఆగమయ్యే పార్టీలని, వాటికి ఓటు వేయొద్దని కోరారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి​ బీఆర్ఎస్​అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్​రావు, పోచారం శ్రీనివాస్​రెడ్డి, గూడెం మహిపాల్​రెడ్డి, చింతా ప్రభాకర్,​​ సునీతాలక్ష్మారెడ్డి, పార్టీ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్​కుమార్, మాజీ హోం మంత్రి మహమూద్​ అలీ, దేశపతి శ్రీనివాస్​తదితరులు హాజరయ్యారు.