ఏపీ కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇస్తమన్న కేసీఆర్!

ఏపీ కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇస్తమన్న కేసీఆర్!
  • సీఎం హామీ ఇచ్చారన్న ఉద్యోగ సంఘాల నేతలు
  • పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ మీటింగ్ 
  • బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటన: రాజేందర్ 
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం మద్దతు కోరారు
  • సాగర్ నోటిఫికేషన్కు ముందే సమస్యలు 
  • పరిష్కరించుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 27 శాతం కంటే ఎక్కువ పీఆర్సీ ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పినట్టు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రకటన చేయలేకపోతున్నామని ఆయన అన్నట్లు పేర్కొన్నాయి. మంగళవారం టీఎన్జీవో, టీజీవో, సెక్రటేరియట్ అసోసియేషన్, పీఆర్టీయూలకు చెందిన 11 మంది ఉద్యోగ సంఘాల నేతలు ప్రగతి భవన్ లో సుమారు 5 గంటల పాటు భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలపై సీఎంతో నేతలు చర్చించారు. మీటింగ్ తర్వాత టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, టీచర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇదే విషయం సీఎంకు చెప్పామన్నారు. ప్రతి నెల 500 మంది వరకు రిటైర్ అవుతున్న విషయం కూడా చెప్పామన్నారు. కోడ్ ముగియగానే రిటైర్ మెంట్ ఏజ్ 61 ఏండ్లకు పెంచుతామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకొచ్చేలా వెంటనే ఆదేశాలు ఇస్తామని సీఎం అన్నట్లు తెలిపారు. సాగర్ బైపోల్ నోటిఫికేషన్ కు ముందే తమ సమస్యలు పరిష్కరించుకుంటామని అన్నారు.

ఎన్నికలున్నా.. లేకున్నా కలుస్తుంటం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తాను మాట్లాడలేకపోతున్నానని సీఎం కేసీఆర్ తమతో అన్నారని రాజేందర్ చెప్పారు. కోడ్ ముగియగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సమస్యలపై ఎంతో కాలంగా ప్రభుత్వంతో చర్చిస్తున్నామని, దసరా ముందు డీఏ ఇచ్చారని, డిసెంబర్ 31న కలిశామని, ఎన్నికల కోసం కలవలేదన్నారు. ఎన్నికల కోడ్ వల్ల పీఆర్సీ లేట్ అయిందని, లేకపోతే జనవరిలోనే అందుకునే వాళ్లమన్నారు. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు వారి కుటుంబాలు 10 లక్షల మంది సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. కోడ్ కు లోబడి ప్రయత్నాలు చేస్తున్నామని, తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం లేదని రాజేందర్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య ఏం ఉండదన్నారు. ఉద్యోగులు, టీచర్ల సంఘాలు మొత్తం 13 ఉన్నాయని, వీటితో పీఆర్సీ కమిటీ చర్చలు జరిపిందన్నారు. తమ బ్యాడ్ లక్ వల్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ షెడ్యూలు వచ్చిందని, మరో ఎలక్షన్ నోటిఫికేషన్ (సాగర్ బైపోల్) వస్తుందన్న ఆందోళన ఉందన్నారు. ఈ నెల 14న ఎలక్షన్ ఉందని, 19తో ఎలక్షన్ కోడ్ ముగియనుందని, ఈ గ్యాప్ లోనే తమ సమస్యలపై ప్రకటన చేయాలన్న  ఉద్దేశంతోనే  కేసీఆర్ ను కలిశామని తెలిపారు. ఈ జనవరి నెలలో 14వేల ప్రమోషన్లు ఇప్పించుకున్నామన్నారు.

ఉద్యోగులు ఆందోళన చెందొద్దు
ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ తో చర్చించామని టీజీవో అధ్యక్షురాలు మమత చెప్పారు. 43 శాతం ఫిట్ మెంట్తో రాష్ట్రం ఏర్పడగానే పీఆర్సీ ఇచ్చారని  గుర్తు చేశారు. ఈ జనవరిలో రికార్డు స్థాయిలో ప్రమోషన్లు ఇచ్చారన్నారు. కోడ్ ముగియగానే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారన్నారు.  సీఎంను కలిసిన వారిలో టీఎన్జీవో, టీజీవో ప్రధాన కార్యదర్శులు ప్రతాప్, సత్యనారాయణ, రేచల్, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమాలాకర్ రావు, సెక్రటేరియెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రావు ఉన్నారు. పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్కు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మార్త రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

పీఆర్టీయూ మద్దతు టీఆర్ఎస్‌కే..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్లు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమాలాకర్ రావు, ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తెలిపారు.  మంగళవారం ప్రగతి భవన్ లో సీఎంను కలిశాక వారు ప్రకటన విడుదల చేశారు. పీఆర్టీయూ స్వర్ణోత్సవాలకు హాజరుకావాలని సీఎంను ఆహ్వానించినట్లు వారు తెలిపారు. విద్యాశాఖలో సమస్యలను ఈనెలాఖరు కల్లా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. 

సెక్రటేరియెట్ అసోసియేషన్ మద్దతు కూడా..
ఈ నెల 14న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి వాణిదేవికి ఓటు వేయాలని సెక్రటేరియెట్ ఉద్యోగులను సెక్రటేరియెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి  మాధవరం నరేందర్ రావు, షేక్ యూసఫ్ మియా కోరారు.  సెక్రటేరియెట్ లో 70 కొత్త పోస్టులు మంజూరు చేశారని, 200 మందికి ప్రమోషన్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.