జనం బాధలు పట్టించుకోని రాష్ట్ర సర్కారు

జనం బాధలు పట్టించుకోని రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగు: కేవలం పాలిటిక్స్‌‌‌‌పై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను పక్కకు పెట్టింది. ప్రజల బాగోగులను పట్టించుకోకుండా తీరిక లేనట్లు దాటేస్తున్నది. రోజుకో చోట జనం రోడ్డెక్కుతున్నా.. తమ గోడు చెప్పుకునేందుకు తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందించడం లేదు. అప్లికేషన్లను పరిష్కరించాల్సిన ఆఫీసర్లు కొందరు అధికార పార్టీ లీడర్లకు జేజేలు పలికేందుకు పోటీ పడుతున్నారు. హాస్టళ్లలో తిండి సరిగా పెడుతలేరని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా.. ఫుడ్ పాయిజన్‌‌‌‌తో హాస్టల్, గురుకులాల విద్యార్థులు హాస్పిటళ్ల పాలవుతున్నా సర్కారు చలించడం లేదు. బాసర ట్రిపుల్ఐటీలో వరుసగా విద్యార్థులు నిరసనలు చేస్తే.. ‘సిల్లీ ప్రాబ్లమ్స్’ అంటూ నెల రోజుల దాకా నాన్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలై నలుగురు మహిళలు చనిపోయినా స్పందన కరువైంది.

పంట నష్టానికి తోడు అప్పులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ధరణిలో తప్పులు, భూముల వివాదాలతో కలెక్టరేట్ల ముందు బాధితుల ధర్నాలు, పోడు భూములకు పట్టాలివ్వాలని ఆందోళనలు, పే స్కేల్ ఇవ్వాలని వీఆర్ఏల నిరసనలతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్నా.. అసలేమీ జరగనట్లే ప్రభుత్వం ఉంటున్నది. దళితబంధు కోసం లబ్ధిదారులు ధర్నాలు చేస్తున్నా.. పింఛన్లు ఇవ్వాలంటూ అర్హులు వేడుకుంటున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది. బీజేపీతో పోటాపోటీ అంటూ సభలు, సమావేశాలు, ప్రెస్​మీట్లు పెడుతూ.. జనం గోసను లైట్ తీసుకుంటున్నది.

3 నెలల్లో 100 మంది రైతుల ఆత్మహత్యలు

రాష్ట్రంలో ఈ మూడు నెలల్లోనే వంద మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. 2014 నుంచి 2021 వరకు 5,950 మంది సూసైడ్ చేసుకున్నారు. రైతు బీమా అమలవుతున్నదన్న కారణంతో ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ సీజన్‌‌లో వర్షాలతో  పంట పాడై, పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అండగా ఉంటామని ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వడం లేదు. వర్షాలతో రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం అంచనా వేసినప్పటికీ లెక్కలు బయటకు చెప్పడం లేదు. రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయట్లేదు. నష్ట పరిహారం ప్రకటించి ఇన్​పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడంలేదు. రైతు రుణమాఫీ హామీ అమలు కాక 32 లక్షల మంది రైతులు తాము తీసుకున్న అప్పులకు వడ్డీకి వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.లక్ష లోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్‌‌ హామీ ఇచ్చారు. ఇంత వరకు రూ.50 వేల లోపు అప్పులున్న 5.60 లక్షల మంది లోన్లు మాత్రమే మాఫీ చేశారు. 32 లక్షల మందికి చెందిన రూ.18 వేల కోట్ల లోన్లు అట్లాగే ఉండిపోయాయి.

వివాదాల ధరణి

ధరణిలో తమ భూములు గల్లంతయ్యాయని వేల మంది రైతులు దరఖాస్తులు చేసుకొని తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం ఒక్కరోజే సూర్యాపేట, జనగామ, గద్వాల కలెక్టరేట్లలో గ్రీవెన్స్ డే రోజున రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రతివారం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పట్టాదారు పాస్ బుక్స్ రాక, భూ వివాదాలు పరిష్కారం కాక ఆవేదన చెందుతున్న రైతులు కలెక్టరేట్లు, తహసీల్దార్ ఆఫీసుల దగ్గర ఆత్మహత్యలకు యత్నిస్తున్నారు. భూసమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు పెడతామని 2 నెలల క్రితం ప్రకటించిన సర్కార్.. వాటి ఊసే ఎత్తడం లేదు. 10 లక్షలకు పైగా అప్లికేషన్లు ధరణిలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చాయి. ఇందులో 4 లక్షల అప్లికేషన్లను కారణం చెప్పకుండానే రిజెక్ట్ చేశారు.

హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్

సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాల్లో ఫుడ్‌‌ పాయిజన్‌‌ ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. నాసిరకం సరకులతోనే విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఇప్పటి వరకు 715 ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ 2 నెలల్లోనే 42 చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. టైం టు టైం రివ్యూలు చేయడం, ఎప్పటికప్పుడు మెస్ చార్జీలు పెంచడం, పర్యవేక్షణను పటిష్టం చేయడంలో ప్రభుత్వం ఫెయిలైందనే విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్‌‌ జిల్లాలోని సంక్షేమ హాస్టల్‌‌లో పాము కాటుతో స్టూడెంట్‌‌ చనిపోయాడు. సోమవారం ఆసిఫాబాద్‌‌ జిల్లా కాగజ్‌‌ నగర్‌‌ మండలంలోని బలుగాల మైనార్టీ గురుకులంలో ఫుడ్‌‌ పాయిజన్‌‌తో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నారాయణపేట జిల్లా మాగనూరులోని జెడ్పీ హైస్కూల్‌‌లో మధ్యాహ్న భోజనం తిని 83 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఉస్మానియా వర్సిటీలో రీసెర్చీ స్కాలర్లు, లేడీస్ హాస్టల్​ విద్యార్థినులు కూడా హాస్టళ్లలో తిండి సరిగ్గా పెట్టడం లేదని ఆందోళనలు చేపట్టారు.

నిర్లక్ష్యానికి ప్రాణాలు పోతున్నయ్

ఇటీవల ఇబ్రహీంపట్నంలో కు.ని. ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు మహిళలు చనిపోయారు. న‌‌ల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీకి వచ్చిన మహిళ కోమాలోకి వెళ్లి చ‌‌నిపోయింది. ఈ ఘటనలు సర్కార్ హాస్పిటళ్లలో పరిస్థితులను వేలెత్తి చూపాయి. ఉద్యోగుల కష్టాలు 55 రోజులుగా వీఆర్ఏలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న వీఆర్ఏలను కట్టడి చేసేందుకు ప్రయత్నించటం దుమారం లేపింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల టైమ్‌‌లో వీఆర్ఏలు, భార్యాభర్తల బదిలీలకు అనుమతించాలని టీచర్లు చేపట్టిన నిరసనలు తెలంగాణ ఉద్యమాన్ని తలపించాయి. ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వకపోవటం, పెండింగ్‌‌ డీఏలు చెల్లించకపోవడంతో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పోడు పంచాయితీ తెగేదెన్నడు?

పోడు భూములపై రాష్ట్ర సర్కారు పూటకోమాట మాట్లాడుతున్నది. గతేడాది అక్టోబర్‌‌‌‌లో అప్లికేషన్లు తీసుకున్నారు. ఏడాది కావొస్తున్నా వాటికి పరిష్కారం చూపలేదు. ఇంతకాలం కేంద్రం పరిధిలో ఉందని దాటవేసిన ప్రభుత్వం.. ఇటీవల డిస్ట్రిక్ట్ కో ఆర్డినేషన్ కమిటీలను వేసింది. దీంతో పట్టాలు ఇస్తారా, లేక అప్లికేషన్లు అట్లనే పెట్టుకుంటరా అని పోడు భూముల సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్ 58, 59 కింద ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తులు తీసుకుని ఏడాది అయిపోతున్నది. దాదాపు 4.50 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి.

పింఛన్లకు ఎదురు చూపులే

కొత్త పెన్షన్లపై దాదాపు మూడేండ్లుగా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని మంజూరు చేయడంలోనూ అదే ధోరణిని అవలంబిస్తోంది. ఒకటో తేదీ నుంచి 10 తేదీ లోపు అందే ఆసరా పెన్షన్లు.. నెలాఖరుకు వచ్చినా అందడం లేదు. ఈ నెలలో 20వ తారీఖు వచ్చినా ఆగస్టు నెల పింఛన్లు పడలేదు. ఇక కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని ప్రకటించుకుంటున్న ప్రభుత్వం.. చాలా గ్రామాల్లో పింఛన్ కార్డులు పంపిణీ చేయలేదు. ఆసరా లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అర్హత ఉన్నవాళ్లు లబోదిబోమంటున్నారు.

లీడర్ల మెప్పు పొందితే చాలు..

సర్కారు ఉదాసీనంగా ఉండడంతో కొందరు ఆఫీసర్లు బాధ్యతలు మరిచిపోతున్నారు. మంత్రులు, అధికార పార్టీ లీడర్ల మెప్పు పొందితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రీవెన్స్ డేని మొక్కుబడిగా నడిపించి అర్జీదారుల సమస్యలు పట్టించుకోవటం లేదు. ఇటీవల సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్.. ప్రజలందరి ముందు జిల్లా ‘మంత్రి జగదీశ్ రెడ్డి జయహో’.. ‘జగదీశ్‌‌‌‌ అన్న’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. మంత్రిని బాహుబలితో పోల్చారు. ఇక సంగారెడ్డి కలెక్టర్‌‌‌‌ శరత్‌‌‌‌.. సీఎం కేసీఆర్‌‌‌‌ను అభినవ అంబేద్కర్‌‌‌‌ అంటూ కీర్తించారు. శరత్‌‌‌‌ గతంలో కామారెడ్డి కలెక్టర్‌‌‌‌గా పనిచేస్తున్నప్పుడు సీఎం కేసీఆర్‌‌‌‌ కాళ్లు మొక్కి వార్తల్లో నిలిచారు. అంతకుముందు కేసీఆర్‌‌‌‌ కాళ్లు మొక్కిన సిద్దిపేట కలెక్టర్‌‌‌‌ వెంకట్రామిరెడ్డికి అధికార పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం అవకాశమిచ్చింది. కొందరు ఆఫీసర్లు అధికార పార్టీకి నమ్మిన బంట్లుగా ముద్ర వేసుకుంటూ విమర్శలపాలవుతున్నారు.

ఆత్మహత్యలు పెరుగుతున్నా..

2014 నుంచి 2021 వరకు 5,950 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ సర్కారు లైట్ తీసుకుంటోంది. ఇటీవల వర్షాలకు 14 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా.. భరోసా కరువయింది.  
ముందట పడని రుణమాఫీ సర్కారు రుణమాఫీ చేస్తుందని చాలా మంది బ్యాంకు లోన్​ కట్టలేదు. ఐదారేండ్లుగా వడ్డీ అసలును మించి పోయింది. ఇప్పటికీ రూ.50 వేలలోపు రుణాలనే మాఫీ చేశారు. ఇంకా 32 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ధరణి ఆగమాగం ధరణిలో సమస్యల పరిష్కారం కోసం పది లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో ఏ కారణం చెప్పకుండానే  4 లక్షల దరఖాస్తులు రిజెక్ట్​ చేశారు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని సర్కారు చెప్పింది.. ఇప్పుడా ఊసే లేదు.  

హాస్టళ్లలో పిల్లల గోస 

గురుకులాల్లో ఇప్పటి వరకు 715 ఫుడ్​ పాయిజన్​ ఘటనలు జరిగాయి. రెండు నెలల్లోనే 42 చోట్ల పిల్లలు వాంతులతో ఆస్పత్రి పాలయ్యారు. పురుగుల అన్నం పెడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ముసలోళ్ల ఎదురుచూపు  ఒకటో తేదీ నుంచి 10వ తేదీలోపు రావాల్సిన పింఛన్లు నెలాఖరు వరకూ అందడం లేదు. ఈ నెల 20వ తేదీ వచ్చినా ఆగస్టు నెల ఆసరా పింఛన్లు ఇంకా పడలే. ఇక కొత్త వాటి సంగతి చెప్పనక్కర్లేదు. గుర్తింపు కార్డులే పంచలేదు.

పోడు పంచాయితీ.. 

తెగుతలే పోడు భూములపై సర్కారుది పూటకోమాట. అప్లికేషన్లు తీసుకుని ఏడాదైంది. పట్టాలు ఇస్తరా? లేక అప్లికేషన్లు అట్లనే పెట్టుకుంటరా.. అని రోజుకోచోట బాధితులు ఆందోళనలకు దిగుతున్నారు.  

నలుగురు మహిళలు చనిపోయినా..

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయినా సర్కారు నుంచి స్పందన లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవానికి వచ్చిన గర్భిణులకూ తిప్పలు తప్పడం లేదు. కొన్ని చోట్ల రోగులను ఎలుకలు కరుస్తున్నాయి.

ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు

వీఆర్​ఏలు 55 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. భార్యాభర్తల బదిలీల కోసం టీచర్లు రోడ్డెక్కుతున్నారు.. ఫస్ట్ తారీఖున​ జీతాలివ్వట్లేదని, పెండింగ్​ డీఏలు ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.