భవిష్యత్లో బంగారం సామాన్యునికి అందేనా?

భవిష్యత్లో బంగారం సామాన్యునికి అందేనా?

ప్రపంచంలో బంగారం వినియోగంలో  చైనా తరువాత  భారత్  రెండో స్థానంలో ఉన్నది. ప్రతి సంవత్సరం మన దేశంలో సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగం అవుతున్నది.  ప్రపంచవ్యాప్తంగా బంగారం ఒక పెట్టుబడి వస్తువు కాగా, మనదేశానికి మాత్రం బంగారం ఒక సంప్రదాయమైన, సెంటిమెంట్​తో  కూడుకున్న వస్తువు. ముఖ్యంగా, భారతీయ మహిళకు బంగారం పట్ల మక్కువ ఎక్కువ.  అయితే,  ఇప్పడు బంగారం సామాన్య ప్రజానీకం కొనలేని స్థాయికి  చేరుకుంటోంది.  గత ఆరు నెలల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి.  ప్రస్తుతం 24 క్యారెట్​ పది గ్రాముల ధర సుమారు రూ. లక్షా పదమూడువేలు దాటింది. 

భా  రతీయ సమాజంలో వివాహం అంటే, బంగారం తప్పనిసరి.  సగటు కుటుంబం సైతం  తమ  పిల్లల వివాహాలకు బంగారం కొనుగోలు చేస్తారు.   ఇలాంటి సమయంలో  దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతుండటంతో  భవిష్యత్​లో బంగారం సామాన్యునికి భారంకాక తప్పదు.  బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏమిటి?  భవిష్యత్​లో  బంగారం తగ్గే  అవకాశాలు లేవా?

గత 10 ఏండ్లలో ధర రెట్టింపు

2000 సంవత్సరంలో  10 గ్రాముల 24 క్యారెట్​బంగారం సగటు ధర 4400 రూపాయలు కాగా,  2010 నాటికి సుమారు 20,728 రూపాయలకు పెరిగింది.  ఈ ఐదేళ్లలో సుమారు 171 శాతం వృద్ధి ని  నమోదు చేసింది. కారణం 2008 లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం రావడం ద్వారా పెట్టుబడి దారులు  బంగారంపై పెట్టుబడికి  మొగ్గు చూపారు. ఫలితంగా బంగారం డిమాండ్ పెరిగి ధరలు పెరగడంతో వృద్ధిరేటు గరిష్టంగా నమోదైనది. ఇక  2015 నాటికి 20 శాతం వృద్ధితో బంగారం ధర రూ.  24,931 చేరుకుంది. 2020 నాటికి సుమారు 100 శాతం వృద్ధితో  రూ.50,151లకు  చేరుకుంది. 2025లో సుమారు 110 శాతం వృద్ధితో రూ.1,00,300  చేరుకుంది.

 ఈ ఐదేళ్లలో  కరోనా వంటి ప్రపంచ విపత్తు వచ్చినా బంగారం ధరలు ఏమాత్రం తగ్గలేదు. బంగారం ధర గడిచిన 10 సంవత్సరాల కాలంలో సుమారు 3 రెట్లు పెరిగింది.  2025 జనవరి నెలలో బంగారం  కనిష్ట  ధర రూ. 78 000 ఉండగా సెప్టెంబర్ మొదటి వారానికి దాని ధర గరిష్టంగా రూ. 1,13,000కు  చేరుకుంది. కేవలం ఈ 8 నెలల్లోనే సుమారు   40 శాతం బంగారం ధరలు పెరిగాయి. 2025 సంవత్సరం డిసెంబర్ నాటికి బంగారం ధర సుమారు 1,20,000 రూపాయలకు చేరుకునే అవకాశం ఉన్నది.  అయితే బంగారం ధరల పెరుగుదల కేవలం  మన దేశానికే పరిమితం కాలేదు. అమెరికాలో 10 గ్రాముల 24 క్యారెట్​బంగారం ధర మన దేశ కరెన్సీతో  పోలిస్తే సుమారు రూ. 1,05,950 ఉంది.  ఇలా  ప్రతి దేశంలోనూ   సగటున లక్ష ఐదు వేల రూపాయల నుంచి లక్షా  పదివేల రూపాయల మధ్యలో  బంగారం ప్రస్తుతం  ట్రేడ్ అవుతోంది. 

పెరుగుదలకు కారణాలు ఏమిటి?

బంగారం పెరుగుదలకు కారణాలు రెండు కోణాలలో చూడాలి.  మొదటిది  అంతర్జాతీయ పరిణామాలు కాగా  రెండోది  డొమెస్టిక్ పరిస్థితులు.  బంగారం ధరలు ఇలా పరుగులు పెట్టడానికి  అంతర్జాతీయ పరిణామాలు కీలకమైనవి.  అవి రెండు రకాలు. మొదటిది 'భయం'. అవును,  ప్రపంచం ఎప్పుడైతే భయాందోళనలకు గురి అవుతుందో అప్పుడు  బంగారం ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ధరలు పెరగవు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు,  దేశాలు సైతం బంగారంను ఒక రిస్క్ లేని పెట్టుబడి సాధనంగా చూస్తున్నాయి. ఎప్పుడైతే  ప్రపంచంలో  భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందో అప్పుడు పెట్టుబడిదారులు సురక్షిత మార్గాలైన బంగారం, వెండి వంటి వస్తువులపై తమ పెట్టుబడులను మళ్లిస్తారు. ఫలితంగా వాటి ధరలు పెరుగుతాయి.

బంగారం నిల్వలో అమెరికా సుమారు 8133. 46 టన్నులతో  ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ మాత్రం 812.30 టన్నుల నిల్వలతో 9వ స్థానంలో ఉన్నది.  ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, అలాగే ఇటీవల అమెరికా అధ్యకుడు ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం,  ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం వంటివి బంగారం ధరలు రూ.లక్ష  చేరడానికి కారణం అయ్యాయి.  ఇక రెండో కారణం డాలర్. బంగారం,  డాలర్​కు  మధ్య  అవినాభావ సంబంధం ఉంది.  ప్రపంచ వాణిజ్యం ఎక్కువశాతం అమెరికా డాలర్​తో జరుగుతుంది. 

డాలర్ బలంగా ఉంటే, బంగారం ధర పెరగదు. ఒకవేళ డాలర్ విలువ తగ్గితే బంగారం ధర పెరుగుతుంది. అమెరికా ఫెడ్ బ్యాంకు  వడ్డీ రేట్లను తగ్గించడం, ఫెడ్ విషయాలలో అధ్యకుడు ట్రంప్  తలదూర్చడం, దేశాల మధ్య డాలర్​తో జరిగే వాణిజ్యం తగ్గడం,  ప్రపంచవ్యాప్తంగా యూరో కరెన్సీ బలపడుతుండటం వంటి కారణాలతో  డాలర్ బలహీనపడుతున్నది. ఎప్పుడైతే డాలర్ విలువ తగ్గుతుందో అప్పుడు పెట్టుబడిదారులు బంగారం ఎక్కువ కొనుగోలు చేస్తారు.  ఫలితంగా బంగారం డిమాండ్ పెరుగుతుంది. మనదేశంలో కేవలం ఒక ఏడాదిలో  1.6 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కానీ, సగటున మన దేశ బంగారం వినియోగం మాత్రం సుమారు 850 టన్నులు. అంటే సుమారు 848.4 టన్నుల బంగారం మనం దిగుమతి చేసుకుంటున్నాం.   
అందువలన డాలర్ రేటు పెరిగినప్పుడు దిగుమతి వ్యయం పెరుగుతుంది. అది చివరిగా వినియోగదారునిపై పడుతుంది. ఫలితంగా ధరలు పెరుగుతాయి.

స్టాక్ మార్కెట్​తో సమానంగా బంగారం రిటర్న్స్

స్టాక్ మార్కెట్ రిటర్న్స్తో సమానంగా బంగారంపై  రిటర్న్స్  వస్తుండటం చేత ఎక్కువమంది  బంగారం కొనుగోలు చేస్తున్నారు.  గత  పదేళ్లలో బంగారం,  స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ను  పరిశీలిస్తే,  2014లో 10 గ్రాముల బంగారం ధర సగటున 28,000 నుంచి 11. 07 శాతం కాంపౌండ్ యాన్యుయేల్ గ్రోత్ రేట్​తో  2024కు 79,610కి చేరుకుంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 ఇండెక్స్ విలువ కూడా  గత పదేళ్లలో  8,000 నుంచి 11.6 శాతం కాంపౌండ్  యాన్యుయేల్ గ్రోత్ రేట్​తో  2024కు 24,000 కు చేరుకుంది. అంటే, అంత్యంత రిస్కుతో కూడుకున్న స్టాక్ మార్కెట్  పెట్టుబడులతో సమానంగా  బంగారం పై పెట్టుబడి  లాభసాటిగా ఉన్నది. అందుకే ప్రతిఏటా దేశీయంగా బంగారం డిమాండ్ పెరగడం, సప్లై  పెరగకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ఇక భవిష్యత్​లో బంగారం ధరలు పెరుగుతాయా లేదా అనే విషయానికి వస్తే, కొన్ని సంస్థల అంచనాల ప్రకారం రానున్న డిసెంబర్ నాటికి బంగారం విలువ  మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ, ఇతర సంక్షోభాలను బట్టి బంగారం ధరలు ప్రభావితం అవుతాయి.

యుద్ధాలు, వాణిజ్య ఆటంకాలు, ఆర్థిక , రాజకీయ అనిశ్చితి వంటివి మొదలైనప్పుడు..  ప్రపంచ స్టాక్  మార్కెట్స్ కుప్పకూలడం, బంగారం ధరలు పెరగడం జరుగుతాయి. 2022 లో మొదలైన  రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం. ఆ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంకు దారి తీస్తుంది అన్న ‘భయంతో’  ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి తీసి బంగారం కొనుగోలు చేశారు. కేవలం  పెట్టుబడిదారులే కాకుండా ప్రపంచ దేశాలు సైతం తమ వద్ద ఉన్న కరెన్సీ నిల్వలను తగ్గించుకొని బంగారం నిల్వలను పెంచుకున్నాయి. ముఖ్యంగా ట్రంప్  సుంకాల నిర్ణయాలతో  బెంబేలెత్తుతున్న ప్రపంచ దేశాలు భవిష్యత్ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి  తమ  బంగారం  నిల్వలు పెంచుకుంటున్నాయి. 

డా. రామకృష్ణ బండారు,
 కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, 
సెంట్రల్ వర్సిటీ ఆఫ్ కేరళ