కార్మికులను వేధిస్తున్న సర్కారు: కోదండరాం

కార్మికులను వేధిస్తున్న సర్కారు:  కోదండరాం

బెల్లంపల్లి రూరల్/బజార్ హత్నూర్/నేరడిగొండ/ బెల్లంపల్లి రూరల్: వెలుగు: కార్మికులకు నష్టం చేసే జీవోలను త్వరగా అమలు చేస్తున్న ప్రభుత్వం వారికి ప్రయోజనకరంగా ఉండే జీవోలను మాత్రం అమలు చేయడం లేదని టీజేఎస్​అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం విమర్శించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు అన్ని పనులు చేయాలని తీసుకొచ్చిన జీవో 51ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, కానీ కనీస వేతనం చెల్లింపుపై పెట్టిన జీవో 60ను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల శ్రమను దోచుకుంటూ కనీస వేతనం ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా వేధించడం దారుణమన్నారు. 

కేసీఆర్​ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్​చేశారు. కన్నెపల్లి మండల కేంద్రంలో కార్మికులు చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు దీక్ష చేస్తున్న కార్మికులకు ఎమ్మార్పీఎస్ నేతలు మద్దతు తెలిపారు. జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేశ్ మాట్లాడుతూ.. కార్మికులు 21 రోజులుగా సమ్మె చేస్తున్నా  వారిని పట్టించుకోకుండా ప్రభుత్వ మొండి వైఖరితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాయకులు గోటిముక్కల మధుకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కో- కన్వీనర్ పాలెపు గణేశ్​ పాల్గొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న కార్మికులకు అప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాథోడ్ పార్వతి సంఘీభావం తెలియజేశారు. కార్మికులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.