ములుగుకు రూ. కోటి సాయం

ములుగుకు రూ. కోటి సాయం
  • మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం : సత్యవతి రాథోడ్​

ములుగు, వెలుగు: భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇతర ప్రజా అవసరాల పునరుద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్​కోటి రూపాయలు మంజూరు చేశారని మంత్రి సత్యవతి రాథోడ్​ తెలిపారు. అలాగే, వరదల్లో చిక్కుకొని మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. సర్వం కోల్పోయిన వారికి తక్షణ సాయంగా రూ.25 వేలు అందిస్తున్నామన్నారు. ఆ జిల్లాలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. 

అనంతరం ములుగు ఆర్అండ్​బీ గెస్ట్​హౌజ్​లో ఎంపీ మాలోతు కవితతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 70 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు వరదల్లో కొట్టుకుపోయి 8 మంది చనిపోయారని, పలువురు గల్లంతయ్యారని చెప్పారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో నీటి ఉధృతికి ముగ్గురు కొట్టుకుపోయారని తెలిపారు. రెండు జిల్లాల్లో వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు చేపడతామన్నారు.