బీఆర్‌‌‌‌ఎస్‌‌లో ఉండేదెవరు? పోయేదెవరు?..ఆరా తీస్తున్న కేసీఆర్

బీఆర్‌‌‌‌ఎస్‌‌లో ఉండేదెవరు? పోయేదెవరు?..ఆరా తీస్తున్న కేసీఆర్
  • కాంగ్రెస్‌‌తో టచ్‌‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల పేర్లతో లిస్ట్
  • జాబితాలో 21 మంది ఎమ్మెల్యేల పేర్లు
  • ఎవరెవరు ఎందుకు పోతున్నరని ఎంక్వైరీ
  • ఇప్పటికే గేట్లు తెరిచామని సీఎం రేవంత్​ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీలో ఎవరెవరు ఉంటున్నారు? ఎవరెవరు పోతున్నారు? అనేదానిపై ఆ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్‌‌తో టచ్‌‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల లిస్టును తయారు చేయించుకుని, వాళ్లెందుకు పార్టీ మారుతున్నారో ఎంక్వైరీ చేయిస్తున్నారు. 26 మంది తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

కాగా, కేసీఆర్ తయారు చేయించిన లిస్టులో 21 మంది పేర్లు ఉన్నట్టు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌‌రావు, కడియం శ్రీహరి, జగదీశ్​‌‌రెడ్డి, పద్మారావుగౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌‌ సహా మరికొంత మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌‌తో ఇప్పటివరకూ టచ్‌‌లోకి పోలేదని బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు చెబుతున్నారు.కేసీఆర్ దగ్గరున్న లిస్టులో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, మంత్రులను కలిసిన ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. 

నేరుగా ముఖ్యమంత్రినో, మంత్రులనో కలవకపోయినా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల ద్వారా, ఆ పార్టీ సీనియర్ నాయకుల ద్వారా అధికార పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్న ఎమ్మెల్యేల లిస్ట్ కూడా కేసీఆర్ వద్ద ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఓ వైపు బీఆర్‌‌‌‌ఎస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌‌లో చేర్చుకునేందుకు ఇటు రేవంత్‌‌, అటు పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. 

హోలి తర్వాత రెండు దఫాల్లో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి దఫాలో ఐదుగురు, రెండో దఫాలో 11 మంది చేరుతారని ప్రచారం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో లోక్‌‌సభ ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్‌‌లకు వీరిని దూరంగా ఉంచాలని పార్టీ ముఖ్యనాయకులకు ఇప్పటికే కేసీఆర్ సూచించినట్టు తెలుస్తున్నది. మిగిలిన వాళ్లలో ఎవరెవరు  పోతున్నరో నిర్ధారించుకున్న తర్వాత వారిని కూడా పక్కనపెట్టాలని భావిస్తున్నారు. లోక్‌‌సభ ఎన్నికల ముంగట ఓ వైపు కవిత అరెస్ట్‌‌, మరోవైపు పార్టీ నుంచి వలసలు కేసీఆర్‌‌‌‌కు తలనొప్పిగా మారాయి. 

పాత బంధాలతోనే జంపింగ్​

కేసీఆర్ వద్ద ఉన్న లిస్టులో మెజారిటీ సభ్యులు గతంలో టీడీపీ, కాంగ్రెస్‌‌లో పదవులు అనుభవించిన నేతలేనని బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు చెబుతున్నారు. బీఆర్‌‌‌‌ఎస్ గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది గతంలో టీడీపీలో పనిచేయగా, ఇంకో 13 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌‌తో అనుబంధం ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు నయానో, భయానో వీరిని కేసీఆర్‌‌‌‌ బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేర్చుకున్నారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌‌ గూటికి చేరడం వల్ల నియోజకవర్గాల్లో పెద్దగా వ్యతిరేకత ఉండదని వీరు భావిస్తున్నారు.   

చేరిక లాంఛనమే

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌‌రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌‌గౌడ్‌‌ అధికారికంగా కాంగ్రెస్‌‌లో చేరనప్పటికీ  సీఎం రేవంత్‌‌ను కలిసొచ్చిన తర్వాత బీఆర్‌‌‌‌ఎస్‌‌కు దూరంగా ఉంటున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజ్‌‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌‌‌‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతోపాటు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌‌‌‌ను కలిశారు. 

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌‌‌‌రెడ్డి త్వరలోనే సీఎం రేవంత్‌‌ను కలుస్తానని ప్రకటించారు. మెదక్ పార్లమెంట్‌‌ పరిధిలోని ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఇప్పటికే సీఎం రేవంత్‌‌తో భేటీ అయ్యారు. అయితే, తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్టు వారు చెప్పుకొచ్చారు. ఇలాగే చెప్పిన దానం నాగేందర్‌‌‌‌.. ఇప్పటికే అధికారికంగా కాంగ్రెస్‌‌లో చేరిపోయారు. బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌‌లోకి రప్పించే పనులను ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులకే కాంగ్రెస్ అప్పగిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో ఎవరుంటరు? ఎవరు పోతున్నరు? అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరితో పాటు తాము అన్నట్టుగా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.

గ్రేటర్‌‌‌‌పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్‌‌ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. 24 సీట్లలో 16  బీఆర్‌‌‌‌ఎస్, 7 ఎంఐఎం, ఒకటి బీజేపీ గెలుచుకున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌‌గిరి పార్లమెంట్ పరిధిలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్‌‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలంటే, ఎమ్మెల్యేల సహకారం తప్పనిసరి అని ఆ పార్టీ భావిస్తున్నది. 

ఈ నేపథ్యంలో సిటీలోని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్పెషల్​ ఫోకస్ చేసింది. హోలి తర్వాత జరిగే చేరికల కార్యక్రమంలో వీళ్లే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే చేరికలకు గేట్లు తెరిచామని సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రకటించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేగా ఉన్న దానంను చేర్చుకుని సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇచ్చారు. బీఆర్‌‌‌‌ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌‌రెడ్డిని చేర్చుకుని చేవెళ్ల సీటు కేటాయించారు. 

తమ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌‌లోకి తీసుకొచ్చేందుకు ఈ ఇరువురు లీడర్లు లైజనింగ్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఇరువురికి టికెట్లు ఓకే అయ్యే నాటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్‌‌‌‌పై అనర్హత పిటిషన్ ఇవ్వడం కోసం సిటీ ఎమ్మెల్యేలు వెళ్లి స్పీకర్‌‌‌‌ను కలవాలని పార్టీ హైకమాండ్ సూచించినా.. వారు పెడచెవిన పెట్టినట్టు తెలిసింది. 

చివరకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌రెడ్డి నేతృత్వంలో స్పీకర్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌‌ మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఒక్క కౌశిక్‌‌రెడ్డి మాత్రమే ఆ రోజు మీడియాతో మాట్లాడటం గమనార్హం.