కేసీఆర్ ​పాలన స్వర్ణయుగం : ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్

కేసీఆర్ ​పాలన స్వర్ణయుగం : ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్
  • ఆయన అధికారంలో లేకపోవడం బాధాకరం: ఆర్ఎస్​ ప్రవీణ్​
  • ఎర్రవల్లి ఫామ్​హౌస్​లో కేసీఆర్​ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరిక
  • కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని ప్రకటన

హైదరాబాద్, వెలుగు : బీఆర్‌‌‌‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పదేండ్లపాటు స్వర్ణయుగాన్ని చూసిందని, ఆయన పాలనలో బలమైన తెలంగాణకు పునాదులు పడ్డాయని  ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేరని, ఇది చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికీ కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు.  సోమవారం ఎర్రవల్లిలోని ఫామ్‌‌హౌస్​లో కేసీఆర్​ సమక్షంలో ప్రవీణ్​కుమార్​ బీఆర్ఎస్​ పార్టీలో చేరారు. కేసీఆర్​ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  అంతకుముందు ప్రవీణ్​కుమార్​ హైదరాబాద్​లోని తెలంగాణ భవన్‌‌లో  మీడియాతో మాట్లాడారు. 

ప్రత్యేక పరిస్థితుల్లో తాను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నానని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నదని చెప్పారు. ఏండ్లుగా చితికిపోయిన ప్రజలకు తెలంగాణ వాదంతో కేసీఆర్ విముక్తి కల్పించారని కొనియాడారు. తరతరాలుగా చితికిపోయిన సామాజిక వర్గాలకు బహుజనవాదం విముక్తి కల్పించి, వెలుగు వైపు నడిపించిందని చెప్పారు.

గోదావరి, ప్రాణహిత నదుల తీరుగా బహుజనవాదం, తెలంగాణవాదం ఏదో ఒక చోట కలుస్తాయని అన్నారు. రెండు వాదాల్లోనూ అణిచివేత, విముక్తి కామన్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాయని తెలిపారు. తాను ఎక్కడున్నా బహుజన వాదంతోనే ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తాను ప్యాకేజీల కోసం రాలేదని, అలాంటి వ్యక్తినైతే అధికార పార్టీలోనే చేరేవాన్ని కదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పునర్నిర్మాణం, బహుజనుల అభివృద్ధి కోసమే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నట్టు చెప్పారు. అందరూ పార్టీలో నుంచి వెళ్లిపోతుంటే, తాను ఒక బలగంలా పార్టీలోకి వచ్చానని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకులు చెబుతున్నారని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్ వెల్లడించారు.

బెదిరింపులకు భయపడను

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి తనను ఓ వైపు సుతిమెత్తగా పొగుడుతూనే.. మరోవైపు వార్నింగ్ ఇస్తున్నాడని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్ ఆరోపించారు. టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఉండమని తనకు రేవంత్​రెడ్డి ఆఫర్​ ఇచ్చిన మాట వాస్తవమే అని తెలిపారు. తాను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకుని, ఆ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించానని స్పష్టం చేశారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వైపు పోతే ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి తనను హెచ్చరిస్తున్నారని అన్నారు.

నేను కూడా పాలమూరు బిడ్డనే. నడిగడ్డ గాలి పీల్చి, నడిగడ్డ తిండి తినే పెరిగిన. బెదిరింపులకు లొంగే వ్యక్తిని కాదు. గేట్లు తెరిచానని రేవంత్ అన్నారు. చాలా మంది పిరికివాళ్లు, స్వార్థపరులు, అసమర్థులు ఆ గేట్లలో నుంచి గొర్రెల్లా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నారు. ఆ గొర్రెల మందలో ఒక్కడిగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్ ఉండడు. నేను ఆ మందలో ఒక్కన్ని కాలేదన్న అక్కసుతోనే రేవంత్ అలా మాట్లాడుతుండొచ్చు. వార్నింగ్‌‌‌‌‌‌‌‌లు ఇచ్చి, రేవంత్ ఆయన హోదాను ఆయనే తగ్గించుకోవద్దు’ అని ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్ హెచ్చరించారు.

 కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకుని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నావని తనపై  సోషల్ మీడియాలో  కొందరు విమర్శలు చేస్తున్నారని, అలా తీసుకునే వాడినైతే అధికారంలో ఉన్న రేవంత్‌‌‌‌‌‌‌‌ దగ్గరికే వెళ్లేవాడినని అన్నారు. తాను అవినీతిపరుడిని, పిరికివాడిని కాదని, అందుకే తనకు భయం లేదన్నారు. తాను ఎక్కడున్నా బహుజనుల కోసమే పనిచేస్తానని, ప్రజలు తనను అర్థం చేసుకోవాలని ప్రవీణ్​కుమార్​ కోరారు.