ఓట్ల వేట !.. సర్కారు మార్క్ పోలరైజేషన్

ఓట్ల వేట !..  సర్కారు మార్క్ పోలరైజేషన్
  • సర్కారు మార్క్ పోలరైజేషన్
  • గృహలక్ష్మి కింద రూ. 3 లక్షలు
  • బీసీ బంధు కింద రూ. 1 లక్ష
  • రుణమాఫీ పూర్తిగా అమలు
  • ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ
  • సర్కారు జాగాలు అమ్మి.. వైన్స్ టెండర్లు ముందస్తుగా పెట్టి..
  • పైసల్లేకున్నా పడరాని పాట్లు
  • ప్రతిపక్షాల దూకుడుకు బ్రేక్ వేసే వ్యూహం
  • మరిన్ని కొత్త పథకాల అమలుకు కసరత్తు

హైదరాబాద్ : నాలుగు నెలల ముందే సర్కారు ఓట్ల వేట షురూ చేసింది. కొత్త పథకాలతో వివిధ వర్గాలను ఆకట్టు‘కొనేందుకు’సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. ఖాళీగా ఉన్న ఖజానాను నింపుకొనేందుకు భూములను అమ్ముతోంది.. మూడు నెలల ముందస్తుగానే వైన్స్ టెండర్లు నిర్వహించి ఆ సొమ్మను కొత్త స్కీములకు డైవర్ట్ చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొత్త పథకాలు.. రకరకాల స్కీములతో ప్రజలను ఆకట్టుకొనే వ్యూహంతో ముందుకు సాగే కేసీఆర్ ఈ సారీ అదే పంథాను ఎంచుకున్నారు. బీసీ వర్గాలను ఆకట్టుకొనేందుకు బీసీ బంధు పథకం కింద దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష సాయం అందించారు. ఈ పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ప్రతి సెగ్మెంట్ లో కొందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అందరికీ సాయం అందిస్తామని, మిగతా వారికి విడతల వారీగా ఇస్తామని ఎమ్మెల్యేలు, మంత్రులు చెబుతున్నారు. లబ్ధి పొందిన వారు.. దరఖాస్తు చేసుకొని సాయం కోసం ఎదురు చూస్తున్న వారి ఓట్లను తమ ఖాతాలో వేయించుకొనే ప్లాన్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ సాగుతోంది. 

వన్ షాట్ టు బర్డ్స్ 

డబుల్ బెడ్రూం ఇండ్లు అందించలేదన్న విమర్శను తట్టుకోవడంతోపాటు సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారిని ఆకట్టుకునేందుకు సర్కారు తన ఒరలోంచి తీసిన సరికొత్త స్కీం గృహ లక్ష్మి. సొంత జాగా ఉండి.. ఇండ్లు కట్టుకోలేని వారికి రూ. 3 లక్షల సాయం అందించేందుకు సర్కారు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, కేటాయింపును బ్యాలెన్స్ చేసుకునేందుకు ఈ పథకం మాస్టర్ పీస్ లా పనిచేస్తుందని గులాబీ పెద్దలు భావిస్తున్నారు. ఒక్కో గ్రామం నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మూడు దశల్లో అందించే సాయానికి త్వరలో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి తొలివిడత సాయం అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికీ ఇస్తామని ఆశచూపుతూ.. తొలివిడతలో కొందరి ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఓట్లను మళ్లించుకునేందుకు ఈ పథకం రూరల్ లో బాగా వర్కవుట్ అవుతుందని గులాబీ పార్టీ భావిస్తోంది. 

మాస్టర్ స్ట్రోక్.. రుణమాఫీ 

నాలుగున్నరేండ్లుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ఎమ్మెల్యేలను అడ్డుకొంటున్నా.. పట్టించుకోని సర్కారు.. ఏక బిగిన రుణమాఫీ చేసేసింది. గ్రామాల్లో వస్తున్న వ్యతిరేకతను గ్రహించే ఖజానాలో డబ్బుల్లేకున్నా ఎట్టకేలకు అలా సర్దేసింది. దీంతో రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో అస్త్రాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే రుణమాఫీ పొందిన రైతులను గ్రామాల్లో ప్రాక్టికల్ గా చూపుతూ.. ఉచిత కరెంటును అస్త్రంగా వాడుకొని.. మూడు గంటలు.. మూడు పంటల నినాదాన్ని తెరమీదకు తెచ్చే వ్యూహాన్ని అమలు చేయనుంది. 

ఆర్టీసీని అలా ఆకట్టుకున్నారు 

ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో రూట్ల ప్రైవేటైజేషన్ చేస్తామని, ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వంలో విలీనం చేసుకొనే ప్రసక్తే లేదని, కార్మిక సంఘాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్ అంతలోనే యూటర్న్ తీసుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా ఆర్టీసీ కార్మికులపై ప్రేమ కురిపించారు. గ్రామాలు, పేద, మధ్య తరగతిని ప్రభావితం చేయగలిగే శక్తి కండక్టర్లు, డ్రైవర్లకు ఉండటంతో వారి డౌన్.. డౌన్ అంటూ నినదించిన కార్మికులతోనే తన చిత్రపటాలకు పాలాభిషేకం చేయించుకున్నారు. అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి వాళ్ల మెప్పును కూడగట్టుకున్నారు. 

పైసల్లేకున్నా.. 

మొన్నటి వరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త పథకాలు ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చేందుకు ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. దీనికి తోడు నవంబర్ లో ముగియనున్న వైన్స్ షాపులకు ముందస్తు టెండర్లు నిర్వహిస్తుండటం గమనార్హం. ఎన్నికల సంవత్సరం కావడంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. వీటి ద్వారా ఇప్పటి వరకు భారీగానే ఆదాయం సమకూరింది. ఈ డబ్బులను పథకాలకు మళ్లిండచం ద్వారా ఓట్లను డబ్బాలో వేయించుకోవాలని సర్కారు యోచిస్తోంది. 

ఓట్లు రాలతాయా..? 

రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై విమర్శలు చేసిన ప్రతిపక్షాలకూ సరికొత్త వ్యూహంతో కేసీఆర్ బ్రేకులు వేశారు. కానీ ఇప్పటికే గ్రామీణ ప్రజల్లో చైతన్యం వచ్చింది. రైతుబంధు, ఆసరా చర్చకు వచ్చినప్పుడు సర్కారు డబ్బులే కదా.. ఇంట్లోంచి ఇస్తున్నరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త పథకాల్లో లబ్ధి పొందిన వాళ్లు ఓట్లు వేస్తారా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.