మేడిగడ్డ బ్యారేజీ నష్టానికి..కేసీఆరే బాధ్యత వహించాలి

మేడిగడ్డ బ్యారేజీ నష్టానికి..కేసీఆరే బాధ్యత వహించాలి
  • కమీషన్లు తీసుకుని కట్టడంతోనే ఈ పరిస్థితి
  • పెట్టుబడిదారులు, భూస్వాములు, ఫ్యాక్టరీలకే నీళ్లు
  • సీఎంవి అన్నీ అబద్దపు మాటలు
  • మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్​

ఏటూరునాగారం,వెలుగు : మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనకు సీఎం కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ జయశంకర్ భూపాలపల్లి, మంథని, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్​ అన్నారు. శుక్రవారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని నిర్మించి మూడేండ్లే అయ్యిందని, కేసీఆర్ కుటుంబం పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకొని నాసిరకంగా నిర్మించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రాజెక్టు కడుతున్న టైంలోనే పగుళ్లు వచ్చాయని, విషయం బయటికి తెలిసి అక్కడికి వస్తున్న ప్రజాసంఘాలు, పార్టీలు, ఇతరులను పోలీసులతో అడ్డుకున్నారన్నారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇతర ప్రాంతాల వారికి ఇచ్చారన్నారు. బ్యారేజీ నిర్మాణానికి సాగు భూములను బలవంతంగా తీసుకుని సరైన నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. గోదావరిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటికీ స్థానికులకు చుక్క నీరివ్వకుండా పెట్టుబడిదారులకు, ఫ్యాక్టరీలకు భూస్వాములకే ఇచ్చారన్నారు. కానీ, తెలంగాణ సస్యశ్యామలమైందని అబద్దాలు చెబుతున్నారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రూ.లక్ష రుణమాఫీ చేశారని, అయినా రైతుల అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందన్నారు.