
చండూరు/మర్రిగూడ, వెలుగు: చర్లగూడెం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఏ కష్టం రానివ్వనన్న సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ అమ్మైనా సరే వారిని ఆదుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ప్రవీణ్కుమార్పర్యటించారు. తహసీల్దార్ ఆఫీస్ ముందు దీక్ష చేస్తున్న నిర్వాసితులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రాజెక్టు వల్ల భూమి కోల్పోయిన వారికి భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి.. కేవలం ఎకరానికి రూ. 4.15 లక్షలు పరిహారం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. సర్కారు తీరుతో మనస్తాపానికి గురై చర్లగూడెంలో 50 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలకు చెందిన వారి పిల్లలకు పెళ్లిళ్లు కూడా కావట్లేదన్నారు.
ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వం అడ్డా కూలీలుగా మార్చిందన్నారు. ఈ విషయంపై నాయకులను అడిగితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పెన్నులో ఇంకు అయిపోయిందన్నాడని, జగదీశ్‌రెడ్డి ఉద్యోగాలు అడిగితే చెప్పుతో కొడతానని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అహంకారాన్ని తగ్గించాలంటే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి భూనిర్వాసితుల గురించి మాట్లాడలేదని, ఎందుకంటే టీఆర్ఎస్ పాలనలో ఆయనకు కూడా కాంట్రాక్టులు దక్కాయన్నారు. ప్రాజెక్టుల ద్వారా దోచుకున్న డబ్బుతోనే విమానం కొన్నారని, నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే కేసీఆర్ విమానం ఎక్కాలన్నారు.