కేసీఆర్ ఇప్పటికైనా కమిషన్ ముందుకు రావాలి

కేసీఆర్ ఇప్పటికైనా కమిషన్ ముందుకు రావాలి
  •  హైకోర్టు తీర్పు కేసీఆర్​కు చెంపపెట్టులాంటిది
  • ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరి పారిపోవడం ఏంటి? 
  • బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి డిమాండ్​
  • ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు తీర్పుతోనైనా కేసీఆర్ పవర్​ కమిషన్​ ముందు హాజరై  వాస్తవాలు చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తప్పు జరిగిందని విచారణలో తేలితే కేసీఆర్ శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన కేసీఆర్ కు చుక్కెదురైందని, ఈ తీర్పు ఆయనకు చెంప పెట్టులాంటిదన్నారు.

 రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ ను రద్దు చేయాలనే సాహసం చేయడం సరైంది కాదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోయారన్నారు. మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి విసిరిన సవాల్ పైనే కమిషన్ వేసి విచారణ చేస్తున్నారని, ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరి పారిపోవడం ఏమిటని ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ లో పిడుగులు పడకుండా టెక్నాలజీ ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. కేసీఆర్ పదేండ్లలో చేసిన అక్రమాలు బయటపడుతున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేసీఆర్​కు ఎందుకంత భయం? 

కమిషన్ ముందు హాజరయ్యేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేసీఆర్ అధిక ధరకు కొన్నారన్నారు.  విద్యుత్ ఒప్పందాలలో నిజాలు బయట పడుతాయని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. ఆయన తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్రం రూ.10 వేల కోట్లు నష్టపోయిందని ఆరోపించారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను కేసీఆర్ భయపెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. 

‘‘పిచ్చి తుగ్లక్ పాలన చేసిన ఇద్దరు ముఖ్యమంత్రులను ప్రజలు ఇంటికి పంపించారు. తెలుగువారంతా తెలివిగల వాళ్లని నిరూపించారు” అని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో అవినీతిపై ప్రాథమిక ఆధారాలున్నాయని,  నిజాయితీని నిరూపించుకునే అవకాశాన్ని తమ ప్రభుత్వం కేసీఆర్ కు ఇచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరుతామన్నారు.