ప్రగతి భవన్​లోనే విందులు.. సీఎంతో సదస్సులు

ప్రగతి భవన్​లోనే విందులు.. సీఎంతో సదస్సులు
  • విమాన టికెట్ల నుంచి హోటళ్ల దాకా.. ఖర్చులన్నీ ప్రభుత్వానివే
  • టూరిజం బస్సుల్లో మల్లన్నసాగర్, ఫామ్​హౌస్​ల  టూర్​
  • మన రైతుల్ని ప్రగతిభవన్​ దిక్కు కన్నెత్తి చూడనియ్యని సర్కార్​
  • మూడు నెలల్లో రాష్ట్రంలో 95 మంది రైతుల ఆత్మహత్య
  • ఒక్క బాధిత కుటుంబాన్నీ పరామర్శించని ప్రభుత్వ పెద్దలు

హైదరాబాద్ ​:  మన రైతులను ప్రగతిభవన్ వైపు కన్నెత్తి చూడనివ్వని రాష్ట్ర ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల రైతులకు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా రెడ్​కార్పెట్​తో స్వాగతం పలికింది. తెలంగాణకు వచ్చిన 25 రాష్ట్రాలకు చెందిన  రైతులకు సీఎం ఆఫీసు రెండు రోజులుగా ​ప్రగతి భవన్​లో భారీ ఆతిథ్యం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి వారికి మర్యాదలు చేస్తున్నది. ఇతర రాష్ట్రాల రైతులు అధికారికంగా రాష్ట్ర పర్యటనకు వస్తే వివిధ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి రైతులను కలిసి మాట్లాడాలి. స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆఫీసర్లను కలిసి.. కుదిరితే సీఎంను కలవడం ఆనవాయితీ. కానీ.. అందుకు భిన్నంగా ఈసారి ఇతర రాష్ట్రాల  రైతుల టూర్​కు సీఎంవో డైరెక్షన్​ చేయటం గమనార్హం. స్వయంగా  సీఎంవో ఆతిథ్య పాత్ర పోషిస్తున్నది. సీఎం  డైరెక్షన్​లో ఆఫీసర్లు, టీఆర్​ఎస్​ లీడర్లు వాళ్లను వెంట పెట్టుకొని పలు ప్రాంతాలను చూపిస్తున్నారు. వ్యవసాయం, సాగునీటి కల్పనలో దేశానికే  తెలంగాణ రోల్‌‌ మోడల్‌‌ అని గొప్పలు చెప్పుకునేందుకు అధికార పార్టీ  రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో ఇతర రాష్ట్రాల రైతులను రప్పించిందనే విమర్శలున్నాయి. 

విమానం టికెట్ల నుంచి ఖర్చులన్నీ..!
దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 100 మంది రైతు సంఘాల ప్రతినిధులను హైదరాబాద్‌‌కు రప్పించారు.  ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, చత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్నాటక, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలి తదితర ప్రాంతాల నుంచి రైతు సంఘాల నాయకులకు విమాన టికెట్లు బుక్‌‌ చేయించి హైదరాబాద్‌‌కు పిలిపించారు. శంషాబాద్‌‌ ఎయిర్‌‌ పోర్టులో వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక వాహనాల్లో టూరిజం ప్లాజా హోటల్‌‌కు తీసుకువచ్చారు. వీరికోసం ప్లాజా హోటల్‌‌లోని గదులన్నీ ప్రభుత్వమే బుక్‌‌ చేసింది. టూరిజం బస్సుల్లో సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌‌ ఫారెస్ట్‌‌, మల్లన్నసాగర్ రిజర్వాయర్‌‌, పంపుహౌస్‌‌, సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలను చూపించి తిరిగి హైదరాబాద్‌‌కు తీసుకువచ్చారు. శుక్రవారం రాత్రి వారికి ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి, టీఆర్‌‌ఎస్‌‌ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్‌‌ కుమార్‌‌ రెడ్డి రైతు సంఘాల నాయకుల టూర్‌‌ వ్యవహారాలన్నీ పర్యవేక్షించారు. శనివారం ఉదయం బ్రేక్‌‌ ఫాస్ట్‌‌ అనంతరం ప్రగతి భవన్‌‌కు చేరుకున్న రైతు సంఘాల నాయకులతో కేసీఆర్‌‌ సమావేశమయ్యారు. మధ్యాహ్నం వారితోనే కలిసి లంచ్‌‌ చేశారు. ప్రగతిభవన్​లోని మినీ థియేటర్​లో రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టుపై వీడియోలను వారికి చూపించారు. 

వారం రోజుల ముందే మకాం...
రాష్ట్రంలో రైతు సంఘాల నాయకుల టూర్‌‌ షెడ్యూల్‌‌ను ఖరారు చేయడానికి వారం రోజుల ముందే నలుగురు రైతు నాయకులు హైదరాబాద్‌‌కు వచ్చారు. సదరు నాయకులు ప్రగతి భవన్‌‌లోనే బస చేశారు. మునుగోడు ప్రజాదీవెన సభకు వేలాది కార్ల ర్యాలీతో కేసీఆర్ వెళ్లగా సదరు రైతు నాయకులు ఆయన వెంటే ఉన్నారు. మునుగోడు సభతో పాటు కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు, భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు కేసీఆర్‌‌తో కలిసి అటెండ్‌‌ అయ్యారు. వీరి ఆధ్వర్యంలోనే 25 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల ప్రతినిధులను హైదరాబాద్‌‌కు పిలిపించి వారికి రాచమర్యాదలు చేశారు.

కాళేశ్వరం.. ముఖం చాటేశారు...
25 రాష్ట్రాల రైతులను సీఎం సొంత నియోజకవర్గంతో పాటు మల్లన్నసాగర్​ కు తీసుకెళ్లిన ఆఫీసర్లు.. కాళేశ్వరం టూర్​కు మాత్రం తీసుకెళ్లలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి, అన్నారం పంప్​హౌజ్ లు ఇటీవల గోదావరి వరదలతో మునిగిపోయి అక్కరకు రాకుండా పోయాయి. అదంతా దాచిపెట్టిన ప్రభుత్వం రాష్ట్రంలోని లీడర్లను, రైతులను అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నది. గతంలో రాష్ట్రానికి అతిథులు ఎవరు వచ్చినా  మేడిగడ్డ బ్యారేజీతో పాటు కన్నెపల్లి పంపుహౌస్‌‌ చూపించి గొప్పగా చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఇతర రాష్ట్రాల రైతులను అటువైపు తీసుకెళ్లకుండా ముఖం చాటేసింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌‌, అక్కడి పంపుహౌస్‌‌ను చూపించి.. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు అని ఈఎన్సీ హరిరామ్‌‌ వాళ్లకు మ్యాప్‌‌ ద్వారా వివరించారు. 

ఇతర రాష్ట్రాల రైతు కుటుంబాలకు సాయం...
రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పరామర్శించిన దాఖలాలు లేవు. రైతు బీమా కింద రూ.5 లక్షల సాయం వస్తుందనే ధీమాతో ఆఫీసర్లు, టీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు కూడా రైతుల మరణాలకు కారణాలు తెలుసుకోవడం లేదని ఆ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కానీ.. ఇటీవల పంజాబ్​ రైతు కుటుంబాలకు మాత్రం మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి ఆర్థిక సాయం అందజేసింది. నిరుడు ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో చనిపోయిన పంజాబ్​ రైతుల కుటుంబాలకు మే 22న స్వయంగా సీఎం కేసీఆర్​ చండీగఢ్‌‌కు వెళ్లి.. అక్కడి సీఎంతో కలిసి  600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చి వచ్చారు. ఇటీవల కర్నాటకకు చెందిన జాతీయ రైతు సంఘం నాయకుడు విమల్‌‌ కుమార్‌‌ కాళేశ్వరం ప్రాజెక్టు చూసేందుకు వచ్చి గుండెపోటుతో చనిపోగా.. ఈయన కుటుంబానికి సీఎం కేసీఆర్​ రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నెల 17న రైతుబంధు సమితి చైర్మన్‌‌ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి.. విమల్‌‌ కుటుంబానికి  చెక్కును అందజేశారు. 

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టదా?...
రాష్ట్రంలో దాదాపు రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మూడు నెలల్లోనే 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జూన్​, జులై, ఆగస్టు నెలల్లో పెట్టుబడి భారం పెరిగి..  చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సూసైడ్​ చేసుకున్న రైతుల సంఖ్య 334కు చేరింది. భారీ వర్షాలు, వరదలతో ఇటీవల భారీ ఎత్తున నష్టం వాటిల్లితే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. మూడేండ్లుగా ప్రధాన మంత్రి ఫసల్​బీమా స్కీమ్​ ప్రీమియం చెల్లించకపోవడంతో పంట దెబ్బతిన్న రైతులు పరిహారానికి నోచుకోవడం లేదు. లక్ష రూపాయల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం విడతల వారీగా ఇస్తూ సాగదీస్తున్నది. 16 లక్షల మంది రైతులు కొత్త పంట రుణాలకు నోచుకోవడం లేదు. వరి సాగు వద్దని ఒకసారి.. సన్న వడ్లు  పండిస్తే బోనస్​ ఇస్తామని మరో సీజన్లో సీఎం రాష్ట్రంలోని రైతులకు చెప్పారు. తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వం చేతులెత్తేయటంతో రైతులు నష్టపోయారు.