ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్లిస్తరు?

ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్లిస్తరు?
  • ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్లిస్తరు?
  •  వడ్ల పైసలు ఎట్ల పంపిణీ చేస్తరు?: కేసీఆర్
  • ధరణిని తొలగిస్తే దళారుల రాజ్యమే
  • రైఫిల్ రెడ్డి జనగామకు వచ్చి పిచ్చి కుక్కలా ఒర్రిండు
  • కేసీఆర్‌‌‌‌కు పిండం పెడతానంటున్న వారికి ప్రజలే పిండం పెట్టాలి
  • తనను చూస్తే కాంగ్రెస్, బీజేపీకి  భయమేస్తున్నదని కామెంట్

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: ధరణిని తొలగిస్తే వచ్చేది దళారుల రాజ్యమేనని సీఎం కేసీఆర్ అన్నారు. భూముల ధరలు పెరిగిన రోజుల్లోనూ సమాజం శాంతియుతంగా ఉండటం ధరణి వల్లే సాధ్యమైందని చెప్పారు. శనివారం చేర్యాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెస్.. మళ్లీ వీఆర్వో, గిర్దావర్ వ్యవస్థను తేవడానికి ప్రయత్నిస్తున్నది. ధరణిని తీసివేస్తే రైతుబంధు, వడ్ల పైసలు ఎలా పంపిణీ చేస్తారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి. ఎలక్షనంటే అబద్ధాలు, జూటా మాటలుగా మారాయి. 

50 ఏండ్లలో కాంగ్రెస్ ఏం చేసింది? పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏం చేసింది? అనేది మీ కండ్ల ముందే ఉంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి” అని ప్రజలను కోరారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్సేనని, ఆంధ్రలో కలిపి 50 ఏండ్లు ఏడిపించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘‘ఎవడ్రా తెలంగాణ అన్న రైఫిల్ రెడ్డి.. జనగామకు వచ్చి పిచ్చి కుక్కలా ఒర్రిపోవడానికి సిగ్గుండాలి. ఆంధ్రోళ్ల బూట్లు మోసి, చంద్రబాబుకు చెంచాగిరి చేస్తూ కేసీఆర్‌‌‌‌ను తిట్టడం మర్యాదనా? కేసీఆర్‌‌‌‌కు పిండం పెడతానంటున్న వారికి ప్రజలే పిండం పెట్టాలి. పార్టీ డిపాజిట్ రాక ఓడిపోయేటోడే మీటింగుల్లో మొరుగుతున్నడు. తిట్టడం మాకూ వచ్చు. మేము కూడా ఆగకుండా 24 గంటలు తిడతాం” అని అన్నారు.

నిరూపిస్తే ఇక్కడే ముక్కు నేలకు రాస్త

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రెండు వేల పెన్షన్ ఇస్తున్నారంటే ఇక్కడే ముక్కు నేలకు రాస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. అక్కడ ఇవ్వని వారు ఇక్కడ నాలుగు వేలు ఇస్తామంటే నమ్ముతారా? అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ నేతలు ఈస్ట్ మన్ కలర్ సినిమాలు చూపుతున్నారు. ఇక్కడ ఎవరూ హౌలగాళ్లు లేరు. వాళ్ల చరిత్ర మనకు తెలుసు. వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి అనేక చర్యలు తీసుకున్నాం. నీటి పన్నును కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముక్కు పిండి వస్తూలు చేస్తున్నారు. తెలంగాణలో ఆ పన్ను లేదు. రైతుబంధుకు పుట్టినిల్లు తెలంగాణనే. 

దేశంలో ఎక్కడాలేని పథకాన్ని అమలు చేయడంతో ఇప్పుడిప్పుడే రైతుల ముఖాలు తెల్లబడుతున్నయి. మరో పది పదిహేనేండ్లు నడిస్తే అప్పులు లేకుండా గట్టి పడతారు. రైతు బాగుంటే పది మందికి పనులు దొరుకుతాయి. మొండిగ పనిచేస్తే మంచి పలితాలు వచ్చాయి. గతంలో తెలంగాణ పేరు చెప్తే కరువు ప్రాంతంగా చూసే వారు. ఇది 50 ఏండ్ల కాంగ్రెస్ పాలన ఘనత. కరువుకు గురైన నాడు ఈ కాంగ్రెసోడు ఏడ పన్నడు.. నేడు పుట్ల కొద్దీ ధాన్యం పండించే పరిస్థితికి రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరే కారణం” అని చెప్పారు.

కాంగ్రెస్ గెలిస్తే ఉన్నది పోతది

పల్లాను గెలిపిస్తే ఎకరాకు 16 వేలు అవుతుందని, కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ఉన్నది కూడా పోతుందని కేసీఆర్ అన్నారు. ‘‘మహా మేధావి పీసీసీ అధ్యక్షుడు.. ‘కేసీఆర్‌‌‌‌కు దమాక్ లేదు. 24 గంటల కరెంటు వేస్టు’ అంటున్నడు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మూడు గంటలే కరెంటు వస్తది. రైతులు 10 హెచ్‌‌పీ మోటార్లు పెట్టుకోమంటున్నడు. దీనికి 30 వేలకోట్లు ఎవడిస్తాడు? ఇలాంటి మాటలు కాంగ్రెస్ నేతలకే సాధ్యం” అని విమర్శించారు.

 తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ విద్యాలయాలను మంజూరు చేయలేదని, రాష్ట్రం పన్నులు కడుతున్నా చట్టాన్ని గౌరవించని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు కేసీఆర్‌‌‌‌ను చూస్తే భయమేస్తున్నదని అన్నారు. ఇక్కడ మళ్లీ గెలిస్తే మహారాష్ట్రకు వచ్చి పుంగి బజాయిస్తడనే భయంతో తెలంగాణలోనే కేసీఆర్ బొండిగ పిసికేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.