రేపు మహబూబ్నగర్లో కేసీఆర్ టూర్ 

రేపు మహబూబ్నగర్లో కేసీఆర్ టూర్ 

మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (ఆదివారం) పాలమూరులో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఎంవీఎస్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగసభలో కేసీఆర్  పాల్గొననున్నారు. కేసీఆర్ పాల్గొనే సభ ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒకప్పుడు వలస జిల్లాగా పేరు పొందిన పాలమూరు ఇవాళ వేల మందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. 

14 లక్షల మంది వలసపోయిన జిల్లా ప్రపంచంలో పాలమూరు ఒక్కటే

పాలమూరు చెబితే.. వలసలు గుర్తొచ్చేవని.. 14 లక్షల మంది వలస వెళ్లిన జిల్లా బహుశా ప్రపంచంలో పాలమూరు ఒక్కటేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని.. బతకాలంటే పాలమూరు జిల్లాలో బతకాలనే విధంగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారే బతుకుదెరువు కోసం పాలమూరుకు వలస వస్తున్నారని..   ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి పాలమూరుకు వస్తున్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి  ప్రాజెక్టును పూర్తి చేసుకుని మరింత అభివృద్ధి సాధిస్తామన్నారు. హైదరాబాద్ కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ ను అద్భుతంగా తీర్చిదిద్దుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.